క్యాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు!

‘జన్నత్ 2’ సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈషా గుప్తా. ఆ తరువాత పలు బోల్డ్ చిత్రాల్లో నటించింది. దీంతో ఆమెకి ఇండస్ట్రీలో బోల్డ్ యాక్ట్రెస్ అనే గుర్తింపు వచ్చింది. వెండితెరపై ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా నటించడంతో బయట కూడా అలానే ఉంటుందని చాలా మంది తన విషయంలో భ్రమ పడ్డారని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది ఈషా గుప్తా. దీంతో ఇండస్ట్రీలో పలుమార్లు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పింది.

ఇండస్ట్రీలో ఇద్దరు దర్శకులు అవకాశాల కోసం తమతో గడపమని అడిగినట్లు చెప్పి షాకిచ్చింది ఈషా. అలానే ఓ కో-ప్రొడ్యూసర్ అతడికి లొంగలేదని.. ప్రాజెక్ట్ మధ్యలోనుంచి తనను తప్పించారని వెల్లడించింది. ఒక నిర్మాత అయితే కావాలనే అవుట్ డోర్ షూటింగ్ ప్లాన్ చేసి.. తనతో తప్పుగా ప్రవర్తించాలనుకున్నట్లు తెలిపింది. దీంతో రాత్రిపూట తన రూమ్ లో మేకప్ ఆర్టిస్ట్ ను కూడా పడుకోమని అడిగేదాన్ని అని.. కావాలనే తోడు కోసం ఆమెతో కలిసి ఉండేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కిడ్స్ తో ఇలా తప్పుగా ప్రవర్తించే సాహసం కూడా చేయరని.. అలా చేస్తే వాళ్ల పేరెంట్స్ చంపి పారేస్తారనే భయం ఉంటుందని.. కానీ బయట నుంచి వచ్చే అమ్మాయిలను మాత్రం లోకువగా చూస్తారని చెప్పింది. అవకాశాల కోసం బయట అమ్మాయిలు ఏమైనా చేస్తారనే ఊహల్లో ఉంటారని తెలిపింది. ఇండస్ట్రీలో తనకు సరైన అవకాశాలు రాకపోవడానికి కారణం కూడా కమిట్మెంట్ ఇవ్వకపోవడం వలనే అంటూ చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ తెలుగులో రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది.