పూరి ఆకాశ్ భ‌య‌ప‌డిపోయాడ‌ట‌

పూరి ఆకాశ్ అంటే ఏమో అనుకున్నారు కానీ.. మొన్న త‌న కొత్త చిత్రం రొమాంటిక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో త‌న ప్ర‌సంగం చూశాక చాలామందికి అత‌డి మీద అభిప్రాయం మారిపోయింది. తండ్రి పూరి జ‌గ‌న్నాథ్‌కు ఏమాత్రం త‌గ్గ‌ని రీతిలో పంచ్ ప‌వ‌ర్‌కు ఏమాత్రం త‌గ్గ‌ని రీతిలో ఈ స్పీచ్ ఇచ్చి అంద‌రి నోళ్ల‌లో నానాడీ కుర్రాడు.

టీనేజీలో ఉండ‌గా చేసిన ఆంధ్రా పోరి, ఆ త‌ర్వాత పూర్తి స్థాయి హీరోగా మారి న‌టించిన మెహబూబా చిత్రాలు తీవ్ర నిరాశ‌కు గురి చేయ‌గా.. ఇప్పుడు ఆకాశ్ ఆశ‌ల‌న్నీ రొమాంటిక్ మూవీ మీదే ఉన్నాయి. పూరి స్క్రిప్టుతో ఆయ‌న శిష్యుడు అనిల్ పాడూరి రూపొందించిన సినిమా ఇది. ఈ శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా మీడియాను క‌లిసిన ఆకాశ్.. రొమాంటిక్ సినిమా విష‌యంలో తాను చాలా భ‌య‌ప‌డిన‌ట్లు వెల్ల‌డించాడు.

త‌న కెరీర్‌కు చాలా అవ‌స‌ర‌మైన సినిమా కావ‌డంతో దీన్ని ఓకే చేయ‌డానికి టైం తీసుకున్నాన‌ని.. అలాగే సినిమా చేయాల‌నుకున్నాక ప‌ట్టాలెక్క‌డానికి ఇంకొంత ఆల‌స్యం అయింద‌ని.. ఆ త‌ర్వాత క‌రోనా వ‌ల్ల సినిమా మ‌రింత లేట్ అయింద‌ని ఆకాశ్ చెప్పాడు. ఐతే క‌రోనా టైంలో ఈ సినిమా ఎక్క‌డ ఓటీటీకి వెళ్లిపోతుందో అని తాను తెగ భ‌య‌ప‌డిపోయిన‌ట్లు ఆకాశ్ వెల్ల‌డించాడు. రొమాంటిక్ ప‌క్కాగా థియేట‌ర్ల‌లో విజిల్స్ మ‌ధ్య ఎంజాయ్ చేసే సినిమా అని.. ఇలాంటి సినిమాను ఓటీటీలో చూస్తే కిక్కుండ‌ద‌ని ఆకాశ్ వ్యాఖ్యానించాడు.

రొమాంటిక్ క‌చ్చితంగా పెద్ద హిట్ట‌వుతుంద‌న్న ఆకాశ్.. ఈ సినిమా ఫ‌లితం చూశాక కొత్త సినిమాల గురించి ఆలోచిస్తాన‌ని చెప్పాడు. జార్జిరెడ్డి ఫేమ్ జీవ‌న్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తాను న‌టిస్తున్న చోర్ బ‌జార్ సినిమా దాదాపుగా పూర్త‌యింద‌ని.. అదొక యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ అని చెప్పాడు ఆకాశ్.