డ్రగ్స్ కేసు.. అనన్య పాండేకు మరోసారి నోటీసులు!

డ్రగ్స్ కేసు విషయంలో ఇప్పటికే హీరోయిన్ అనన్య పాండేను రెండుసార్లు విచారించగా.. ఇప్పుడు మరోసారి ఆమెకి నోటీసులు జారీ చేశారు. ముంబై క్రూజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆర్యన్ ఖాన్ ఫోన్ ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అనన్య పాండేతో అతడు జరిపిన వాట్సాప్ చాట్స్ ను గుర్తించారు. ఆ చాట్ లో డ్రగ్స్ ప్రస్తావన ఉండడంతో అనన్య పాండే ఇంట్లో సోదాలు జరిపి.. ఆమె గాడ్జెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

దశలవారీగా ఆమెని విచారిస్తున్నారు. ఈ విచారణలో ఆమె తనపై వస్తోన్న ఆరోపణలను ఖండించింది. డ్రగ్స్ కి సంబంధించి ఆర్యన్ తో తను జోక్ మాత్రమే చేశానని.. అంతకుమించి తనకేం తెలియదని ఎన్సీబీ అధికారుల ముందు చెప్పింది. అయితే ఆర్యన్ కు డ్రగ్స్ సప్లై చేస్తున్న వారి వివరాల గురించి అనన్యకు తెలిసే ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో మరోసారి ఆమెకి నోటీసులు జారీ చేశారు.

అనన్య ఈ వారంలోనే మరోసారి విచారణ కోసం ఎన్సీబీ ఆఫీస్ కు రాబోతుంది. లెక్కప్రకారం.. నిన్న ఆమె ఎన్సీబీ విచారణకు రావాలి. కానీ తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు ఎన్సీబీ అధికారులకు సందేశం అందించింది. దీన్ని అంగీకరించిన అధికారులు.. ఆమెకి ఫ్రెష్ గా మరోసారి నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో ఎన్సీబీ జోనర్ డైరెక్టర్ సమీర్ వాఖండే కూడా ముంబైలో లేరు. ఆయన ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లారు. మరోపక్క ఆర్యన్ బెయిల్ కి సంబంధించి ఈరోజు ముంబై హైకోర్టులో విచారణ జరగనుంది. మరి ఈసారైనా అతడికి బెయిల్ వస్తుందేమో చూడాలి!