విశాల్ మూవీకి థియేటర్లు దొరక్కట్లేదా?

మిగిలిన పండుగలు ఎలా ఉన్నా.. తమిళులు ఎంతో ఆర్భాటంగా చేసుకునే పర్వదినాల్లో దీపావళి ముందుంటుంది. మిగిలిన పండుగల్నిఎలా చేసుకున్నా.. దీపావళిని భారీగా చేసుకోవటం తెలిసిందే. దీనికి తగ్గట్లే ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ ఎత్తున సినిమాల్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. వచ్చే నాలుగున రానున్న దీపావళికి.. కోలీవుడ్ లో సినిమా పండుగ కాస్తా పోటీగా మారింది. స్టార్ హీరో విశాల్ తో పాటు మరో యువ అగ్ర హీరో ఆర్య నటించిన ‘ఎనిమి’కి ఇప్పుడు కొత్త సమస్యలు ఎదురవుతున్నట్లుగా చెబుతున్నారు.

విశాల్ అంటే తమిళనాడులో అతనికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి హీరో నటించిన సినిమా విడుదల అవుతుందంటే.. థియేటర్లు అసలు సమస్యే కాదు. కానీ.. ఎనిమి విషయంలో మాత్రం అందుకు భిన్నమైన అనుభవాన్ని నిర్మాతలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాను దీపావళికి ఒక రోజు ముందుగా నవంబరు 4న రిలీజ్ చేద్దామని చిత్ర దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. అదే రోజున సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘‘అన్నాత్త’’ మూవీని రిలీజ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మూవీ విడుదల అంటే.. అదెంత భారీగా ఉంటుందో తెలిసిందే. దీంతో.. విశాల్ మూవీకి థియేటర్లు దొరకని పరిస్థితి. దీంతో.. ఈ మూవీ టీం ఇబ్బందులకు గురవుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే రజనీ.. విశాల్ సినిమాలు పోటీ పడుతున్న వేళ.. ఈ రేసులో తానెందుకన్న ముందస్తు జాగ్రత్తతో శింబు నటించిన ‘మనాడు’ రిలీజ్ నుంచి తప్పుకుంది.

కానీ.. విశాల్ – ఆర్య నటించిన ఎనిమి మూవీ మాత్రం రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. రజనీ మూవీ విడుదల అవుతున్న వేళ.. విడుదల అవుతున్న విశాల్ మూవీకి కనీసం 250థియేటర్లను కేటాయించాలంటూ ఈ చిత్ర నిర్మాత మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో ఒకటి బయటకు వచ్చింది. అదిప్పుడు వైరల్ గా మారింది. విశాల్ సినిమా కోసం థియేటర్లు దొరకపోవటమా? అన్న ఆశ్చర్యం ఇప్పుడు వ్యక్తమవుతోంది.