ప్ర‌భాస్ అభిమానుల్లో లోలోన ద‌డ‌

బాహుబ‌లితో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన హీరో ప్ర‌భాస్‌. దేశంలో వ‌న్ అండ్ ఓన్లీ పాన్ ఇండియా సూప‌ర్ స్టార్ అంటూ మ‌న ప్ర‌భాస్‌ను బాలీవుడ్ మీడియా వాళ్లు పొగుడుతుంటే యంగ్ రెబ‌ల్ స్టార్ అభిమానుల‌కు అంత‌కంటే ఆనందం ఇంకేముంటుంది? ఐతే బాహుబ‌లి ద్వారా సంపాదించిన ఈ అసాధార‌ణ ఇమేజ్‌ను ప్ర‌భాస్ స‌రిగ్గా ఉప‌యోగించుకోలేక‌పోతున్నాడ‌నే అభిప్రాయం చాలామందిలో ఉంది.

మాస్‌లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ తెచ్చుకున్న అత‌ను.. వాళ్ల అభిరుచికి త‌గ్గ సినిమాలు చేయ‌ట్లేద‌నే అసంతృప్తి ఆ వ‌ర్గంలో ఉంది. సాహో సినిమాలో బోలెడంత యాక్ష‌న్ ఉంది కానీ.. ఆ క‌థ మాస్‌కు అంత‌గా క‌నెక్ట‌య్యేది కాదు. అది మ‌న క‌థ అనుకునేలా ఉండ‌దు. హాలీవుడ్ థ్రిల్ల‌ర్ల స్ఫూర్తితో సుజీత్ ఏదో ట్రై చేశాడు కానీ.. అది మ‌న ప్రేక్ష‌కుల‌కు రుచించ‌లేదు.

దీని త‌ర్వాత అయినా ప్ర‌భాస్ త‌న అభిమానుల‌కు ఏం కావాలో అది అందిస్తాడ‌నుకుంటే.. రాధేశ్యామ్ అలాంటి ఆశ‌లేమీ రేకెత్తించ‌ట్లేదు. త‌న‌కున్న ఇమేజ్‌కు భిన్నంగా క్లాస్ ల‌వ్ స్టోరీ ట్రై చేసిన‌ట్లున్నాడు ప్ర‌భాస్. దాన్న‌యినా సామాన్య ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మ‌య్యేలా, వారిని అల‌రించేలా కొంచెం మాస్ ట‌చ్ ఇచ్చి తీశారా అంటే అలాంటి సంకేతాలూ క‌నిపించ‌డం లేదు.

ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేసిన టీజ‌ర్లో ప్ర‌భాస్ స్క్రీన్ ప్రెజెన్స్, విజువ‌ల్స్, ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ వారెవా అనిపించినా.. ఈ టీజ‌ర్ కాన్సెప్ట్ ఏంట‌న్న‌ది మాత్రం జ‌నాలకు అర్థం కాలేదు. ఇంగ్లిష్‌లో స‌గ‌టు ప్రేక్ష‌కుల‌కు అర్థం కాని విధంగా ఏదో డైలాగ్ చెప్పాడు ప్ర‌భాస్. విజువ‌ల్‌గా ఎంత బాగున్న‌ప్ప‌టికీ.. ఇది మాస్ ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మ‌య్యే సినిమా కాదేమో.. మ‌రీ క్లాస్‌గా ఉండి ఈ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌దేమో అన్న భ‌యాలు క‌లిగింది టీజ‌ర్ చూస్తుంటే. టీజ‌ర్ టాప్ క్లాస్ అని, విజువ‌ల్స్ సూప‌ర‌ని ఎంత చెప్పుకున్న‌ప్ప‌టికీ లోలోన అయితే ప్రభాస్ అభిమానుల్లో కొంచెం ద‌డ‌పుట్టించింది రాధేశ్యామ్ టీజర్.