ఆర్యన్ కేసులో కొత్త ట్విస్ట్.. బెయిల్ కష్టమే!

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆర్యన్ కు పలుమార్లు బెయిల్ రిజెక్ట్ అయింది. తాజాగా జరిగిన హియరింగ్ లో ఆర్యన్ కు బెయిల్ వస్తుందని భావించారు షారుఖ్. కానీ కోర్టు అతడికి షాకిచ్చింది. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ మెసేజ్ లను కోర్టుకి దాఖలు చేశారు ఎన్సీబీ అధికారులు. దీంతో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇవ్వడానికి కోర్టు మరోసారి నిరాకరించింది.

త్వరలోనే హీరోయిన్ గా అరంగేట్రం చేయబోతున్న ఓ ప్రముఖ కుటుంబానికి చెందిన నటితో ఆర్యన్ ఖాన్ వాట్సాప్ లో చాట్ చేశాడు. అది కూడా డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన సమయంలోనే మాట్లాడాడు. ఆ చాటింగ్ లో డ్రగ్స్ కి సంబంధించిన విషయాలను చర్చించాడు. దీంతో ఆ చాటింగ్ కి సంబంధించిన వివరాలను ఎన్సీబీ అధికారులు కోర్టులో సమర్పించారు. కొంతమంది డ్రగ్ డీలర్స్ తో కూడా ఆర్యన్ ఖాన్ కు కాంటాక్ట్స్ ఉన్నాయని, ఆర్యన్ వాళ్లకు రెగ్యులర్ కస్టమర్ అని కోర్టుకి తెలిపారు ఎన్సీబీ అధికారులు.

దీంతో అతడి రిమాండ్ ను మరికొన్ని రోజులు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసిన వెంటనే ఆర్యన్ ఖాన్ ను పోలీసులు, ముంబైలోని ఆర్ధర్ రోడ్ జైలుకి తరలించారు. ఆర్యన్ తో పాటు మరో ఇద్దరికీ కూడా కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆర్యన్ కు బెయిల్ వస్తుందని భావించిన షారుఖ్ దంపతులు.. అతడిని ఇంటికి తీసుకెళ్లడానికి పోలీస్ స్టేషన్ దగ్గర వెహికల్స్ ను రెడీగా ఉంచారు. ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి ఇద్దరు లాయర్లను కూడా నియమించారు. కానీ ఎన్సీబీ అధికారులు కోర్టుకి సమర్పించిన ఆధారాలు బలంగా ఉండడంతో.. ఆర్యన్ కు నిరాశ తప్పలేదు.