శేఖ‌ర్ క‌మ్ముల స‌త్తా ఇంతేనా?

Sekhar-Kammula

పెద్ద ద‌ర్శ‌కుడి సినిమా అంటే ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది. బిజినెస్ వ్య‌వ‌హారాల‌న్నీ ద‌ర్శ‌కుడి పేరుతో కూడా ముడిప‌డి ఉంటాయి. కొన్ని సినిమాల‌కు ద‌ర్శ‌కులే బ్రాండ్ అంబాసిడ‌ర్లు. శేఖ‌ర్ క‌మ్ముల‌లా అన్న‌మాట‌. ఆయ‌న‌కు స్టార్లు అవ‌స‌రం లేదు. ఆ పేరు చాలు. ఆయ‌న‌కు స్టార్ బ‌లం తోడైతే.. ఇక చెప్పేదేముంది? ఏరియా రైట్స్‌, శాటిలైట్‌, డిజిట‌ల్‌… ఈ ధ‌ర‌ల‌కు రెక్క‌లొచ్చిన‌ట్టే.

కానీ ‘ల‌వ్ స్టోరీ’ విష‌యంలో సీన్ రివ‌ర్స్‌. ఈ సినిమా శాటిలైట్‌, డిజిట‌ల్ రైట్స్ ఇటీవ‌లే అమ్ముడు పోయాయి. రూ.11 కోట్ల‌కు కొనేశారు. నిజానికి ఇది మంచి మొత్త‌మే అయినా, శేఖ‌ర్ క‌మ్ముల రేంజ్ మాత్రం కాదు. ఎందుకంటే… ఇదే సీజ‌న్‌లో అమ్ముడుపోయిన నితిన్ సినిమా ‘రంగ్ దే’కి శాటిలైట్‌, డిజిట‌ల్ రూపంలో రూ.12 కోట్లొచ్చాయి. వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు. అంటే.. ఈ కొత్త ద‌ర్శ‌కుడితో పోలిస్తే శేఖ‌ర్‌క‌మ్ముల కోటి త‌క్కువే ప‌లికార‌న్న‌మాట‌.

నాగ చైత‌న్య ఇమేజ్‌, సాయి ప‌ల్ల‌వికున్న క్రేజ్ కూడా ల‌వ్ స్టోరీకి గిరాకీ తెప్పించ‌లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. నితిన్ గ‌త చిత్రం ‘భీష్మ‌’ సూప‌ర్ హిట్ అవ్వ‌డం రంగ్ దేకి బాగా క‌లిసొచ్చింద‌నుకుంటే.. ‘ఫిదా’ అంత‌కంటే పెద్ద హిట్ క‌దా. పైగా టీవీల్లో శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు బాగా చూస్తారు. అయినా.. ఒక కోటి త‌క్కువే ప‌లికిందంటే.. ఇదేదో ఆలోచించ‌ద‌గిన విష‌య‌మే.