మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తాలూకు మంటలు ఇప్పుడిప్పుడే చల్లారేలా లేవు. ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు కార్యవర్గం ప్రమాణ స్వీకారం కూడా పూర్తయినప్పటికీ.. వివాదాలు మాత్రం సద్దుమణగడం లేదు. ఎన్నికల రోజు తమ ప్యానెల్ సభ్యులపై దౌర్జన్యం జరిగిందని ఇప్పటికే ఆరోపణలు చేసిన ప్రకాష్ రాజ్.. ఇప్పుడు ఎన్నికలు జరిగినప్పటి సీసీటీవీ ఫుటేజ్ కావాలని ఎన్నికల అధికారిని కోరడం చర్చనీయాంశంగా మారింది.
ఇలా అడగడం నిబంధనలకు విరుద్ధమేమీ కాదు కాబట్టి.. ఆయన కోరినట్లు ఎన్నికల అధికారి సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చేస్తే సరిపోయేది. కానీ ఆయన అందుకు నిరాకరించడంలో జనాలకు రకరకాల డౌట్లు వస్తున్నాయి.
ప్రకాష్ రాజ్ ఇలాంటి విషయాల్లో అస్సలు తగ్గే రకం కాదు. ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఇప్పుడు వాళ్లేమో సీసీటీవీ రూంకి తాళాలు వేసి విచారణ మొదలుపెట్టారు. ఇప్పుడనే కాదు.. ముందు నుంచి ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తీరు వివాదాస్పదంగానే ఉంటోంది. ఎన్నికల రోజు 600 పైచిలుకు ఓట్లను లెక్కించలేక కొందరు ఈసీ సభ్యులకు సంబంధించి కౌంటింగ్‌ను మరుసటి రోజుకు వాయిదా వేయడం, బ్యాలెట్ బాక్సును వెంట తీసుకెళ్లడంపై ఇప్పటికే విమర్శలు వ్యక్తమయ్యాయి.
అది చాలదన్నట్లు మొన్నటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తాను ఎలక్షన్ ఆఫీసర్ అని మరిచిపోయి ఎన్టీఆర్ తర్వాత మోహన్ బాబు మాత్రమే లెజెండ్ అని, ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించడం తన పూర్వ జన్మ సుకృతం అని వ్యాఖ్యానించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అసలా కార్యక్రమంలో ఆయన పాల్గొనడమే కరెక్ట్ కాదంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరింత విడ్డూరం. ఇప్పుడేమో సీసీటీవీ ఫుటేజ్ విషయంలో కృష్ణమోహన్ వ్యవహరిస్తున్న తీరు కూడా వివాదాస్పదమవుతోంది.