స్వామిరారా కాంబినేషన్ రిపీట్

టాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసిన సినిమాల్లో ‘స్వామి రారా’ ఒకటి. తెలుగులో రామ్ గోపాల్ వర్మ మినహా క్రైమ్ కామెడీ తీసిన దర్శకులు చాలా తక్కువ. అందులోనూ వర్మ చిత్రాల తర్వాత ఆ జానర్లో సినిమాలు మరీ తగ్గిపోయాయి. అలాంటి టైంలో ఆర్జీవీ సినిమాలతో పాటు కొన్ని హాలీవుడ్ చిత్రాల స్ఫూర్తితో ‘స్వామి రారా’ అనే మంచి క్రైమ్ కామెడీ మూవీ తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు యువ దర్శకుడు సుధీర్ వర్మ.

2013లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద విజయమే సాధించింది. ఒడుదొడుకులతో సాగుతున్న నిఖిల్ కెరీర్‌ను ట్రాక్‌లో పెట్టిన సినిమా ఇది. అక్కడి నుంచి మంచి చిత్రాలను ఎంచుకుంటూ విభిన్న ప్రయాణం చేస్తున్నాడు నిఖిల్. ‘స్వామి రారా’ తర్వాత సుధీర్‌తో మళ్లీ ‘కేశవ’ అనే సినిమా చేశాడు నిఖిల్. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఇది మాత్రమే కాదు.. ‘స్వామి రారా’ తర్వాత సుధీర్ తీసిన సినిమాలేవీ సరిగా ఆడలేదు.

ఐతే ఈ మధ్యే కొరియన్ మూవీ ఆధారంగా ‘సురేష్ ప్రొడక్షన్స్’లో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాను మొదలుపెట్టిన సుధీర్.. అది సెట్స్ మీద ఉండగానే కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. అందులో హీరో నిఖిల్ కావడం విశేషం. సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు.

ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తయ్యాక సుధీర్ ఈ సినిమాను మొదలుపెడతాడు. ఈలోపు నిఖిల్ చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేస్తాడు. అతను ఇప్పటికే కార్తికేయ-2, 18 పేజెస్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అవి ముగింపు దశలో ఉన్నాయి. ఈ మధ్యే ఒక కొత్త చిత్రాన్ని నిఖిల్ మొదలుపెట్టాడు. అదయ్యాక సుధీర్ సినిమా మీదికి వెళ్తాడు. మరి ‘కేశవ’ లాగా కాకుండా ఈసారి ‘స్వామి రారా’ లాంటి హిట్‌ను వీళ్లిద్దరూ డెలివర్ చేస్తారేమో చూద్దాం.