ఇలాంటివి సూర్య మాత్రమే చేయగలడు


సినిమా సమాజం మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది కాబట్టి సినిమాలు తీసేవాళ్లు సోషల్ రెస్పాన్సిబిలిటీతో వ్యవహరించాలని అంతా అంటారు. కానీ సమాజం.. బాధ్యత అంటూ చూసుకుంటూ కాసులు రాలవన్న అభిప్రాయంతో ఫిలిం మేకర్స్ ఉంటారు. సినిమాల ద్వారా మంచి చూపించకపోగా.. చెడు ప్రభావం పడేలా సినిమాలు తీసేవాళ్లే ఎక్కువమంది. నిర్మాతల పెట్టుబడితో ఆటలు ఆడలేమన్నది ఇందుకు వాళ్లు చెప్పే కారణం. అందులోనూ హీరోలు ఎంత కమర్షియల్‌గా ఆలోచిస్తారో తెలిసిందే. కానీ చాలా కొద్ది మంది మాత్రమే సమాజం పట్ల తమ బాధ్యతను ఎప్పుడూ మరిచిపోరు. అందులో సూర్య ఒకడు.

చాలామందిలాగా పబ్లిసిటీ కోసం కాకుండా చిత్తశుద్ధితో అతను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. అంతే కాదు.. నీట్ పరీక్షతో పాటు బర్నింగ్ ఇష్యూస్ మీద అతను ధైర్యంగా గళం వినిపిస్తుంటాడు. అంతే కాదు.. తన సినిమాల ద్వారా కూడా ఎప్పుడూ ఎంతో కొంత మంచి చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఏదో మొక్కుబడిగా కాకుండా ఏం చేసినా సిన్సియర్‌గా చేయడం సూర్య స్టయిల్. ఇప్పుడు అతను ‘జై భీమ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

సమాజంలో అణగారిన వర్గాల కోసం పాటుపడే ఒక లాయర్ కథ ఇది. అలాగని ‘వకీల్ సాబ్’ తరహాలో హీరో పాత్రకు కమర్షియల్ టచ్ ఏమీ ఇవ్వలేదు. హీరో ఎలివేషన్ల కోసం ట్రై చేయలేదు. పూర్తిగా బాధితుల కోణంలో సాగే కథ ఇది. వెనుకబడిన కులానికి చెందిన ఒక డ్రైవర్ అన్యాయంగా ఓ కేసులో ఇరుక్కుంటే.. చట్టం, న్యాయం గురించి ఏమీ తెలియని ఆమెకు ఓ లాయర్ అండగా నిలిచి వ్యవస్థ మీద ఎలా పోరాడాడో ఇందులో చూపించబోతున్నారు. దీని టీజర్ చూస్తే సూర్య ఒక బాధ్యతతో, ఆవేదనతో ఈ సినిమా చేశాడని స్పష్టమవుతుంది. అతడి సిన్సియారిటీ ఎలాంటిదో కనిపిస్తోంది.

ఇలా సూర్య మాత్రమే చేయగలడనే అభిప్రాయం జనాల్లో కలుగుతోంది. ఐతే ఇలాంటి సినిమాలు కమర్షియల్‌గా వర్కవుట్ కావడం కష్టం. అందుకే సూర్య స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అమేజాన్ వాళ్లతో ముందే డీల్ కుదుర్చుకుని ఈ సినిమా మొదలుపెట్టాడు. జ్ఞానవేల్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ‘జై భీమ్’ తెలుగు, తమిళ భాషల్లో నవంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.