నందమూరి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సినిమా ‘అఖండ’. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ముందు అనుకున్న ప్రకారమైతే మేలోనే ఈ చిత్రం విడుదల కావాల్సింది. కరోనా వల్ల ఆలస్యం తప్పలేదు. ఆ తర్వాత దసరా రిలీజ్ అన్నారు. కానీ అది సాధ్యం కాలేదు. ఆపై దీపావళి మీదికి ఫోకస్ మళ్లింది.
దీపావళికి నెల రోజుల సమయం ఉండగానే సినిమా షూటింగ్ పూర్తి కావడంతో పండక్కి బాలయ్య సందడి ఉంటుందనే ఆశతోనే ఉన్నారు అభిమానులు. మీడియాలో కూడా దీని గురించి ప్రచారం జరిగింది. కానీ ‘అఖండ’ టీం నుంచి మాత్రం ఈ విషయంలో ఎలాంటి అప్‌డేట్ లేదు. దసరా రోజు దీపావళి రిలీజ్ గురించి ప్రకటన ఉంటుందని.. కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తారని అన్నారు కానీ.. అలాంటిదేమీ జరగలేదు.
దసరా రోజు కనీసం పండుగ శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్టర్ కూడా వదల్లేదని.. రిలీజ్ గురించి అప్‌డేటే లేదని నిర్మాణ సంస్థ ‘ద్వారక క్రియేషన్స్’ను ట్విట్టర్లో నందమూరి అభిమానులు ఉదయం నుంచి తిడుతూనే ఉన్నారు. అయినా సాయంత్రానికి కూడా చలనం లేదు. చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘అఖండ’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఆలస్యం జరుగుతుండటంతో దీపావళి విడుదల సాధ్యం కాదని ఫిక్సయిపోయారట.
క్రిస్మస్, సంక్రాంతి సీజన్లకు బెర్తులు బుక్ అయిపోయిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని డిసెంబరు తొలి వారంలో రిలీజ్ చేయడానికి చూస్తున్నారట. త్వరలోనే దీని గురించి ప్రకటన ఇస్తారని అంటున్నారు. కాబట్టి దీపావళికి రజినీకాంత్ తమిళ అనువాద చిత్రం ‘పెద్దన్న’తో పాటు మారుతి చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’, పూరి ఆకాశ్ మూవీ ‘రొమాంటిక్’లకు ఫిక్సయిపోవచ్చు.