హీరో గారి భార్య ద‌ర్శ‌క‌త్వం


హీరోలు మంచి ఇమేజ్ సంపాదిస్తే.. హీరోల కుటుంబ సభ్యులు కూడా అవకాశం ఉన్నంతమేర సినిమా సంబంధిత వ్యవహారాల్లో పాలు పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కొందరు హీరోలు తమ భార్యలను ప్రొడక్షన్లోకి తీసుకురావడం.. లేదంటే స్టైలింగ్ లాంటివి చేయించుకోవడం చేస్తుంటారు. బాలీవుడ్లో స్వశక్తితో మంచి స్థాయిని అందుకున్న ఆయుష్మాన్ ఖురానా విషయానికొస్తే.. అతడి భార్య తాహిరా కశ్యప్‌కు సినిమాల మీద మంచి పట్టే ఉంది. ఆమెకు మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి. దర్శకత్వ విభాగంలోనూ పని చేసింది.

ఈ అనుభవంతో ఆమె పిన్ని, టాహీ, క్వారంటైన్ క్రిష్ లాంటి షార్ట్ ఫిలిమ్స్ సైతం డైరెక్ట్ చేసింది. ఇప్పుడు ఫీచర్ ఫిలిం డైరెక్టోరియల్ డెబ్యూకు రెడీ అయిపోయింది. ‘శర్మా జీ కి బేటి’ పేరుతో తాహిరా తొలి సినిమా తెరకెక్కనుంది.

ఇందులో సాక్షి తన్వర్, దివ్య దత్తా, సయామీ ఖేర్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. టైటిల్‌కు తగ్గట్లే ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ అట. మహిళల విషయంలో మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ఎలా ఉంటాయో ఫన్నీగా చర్చించబోతోందట తాహిరా. ఇదొక సెటైరికల్ మూవీ అంటున్నారు. ఇటీవల తాహిరా ఆరోగ్య పరంగా ఒక సమస్య ఎదుర్కొని కొన్ని రోజులు ఆసుపత్రిలో గడపాల్సి వచ్చింది. నిల్వ చేసిన బాటిల్ జ్యూస్ తాగడంతో ఆమె అస్వస్థతకు గురై ఐసీయూలో చికిత్స పొందింది. ఇలాంటి ప్రాడెక్ట్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరిస్తూ ఒక పోస్టు కూడా పెట్టింది.

ఆ సంగతలా ఉంచితే తాహిరా ఒక క్యాన్సర్ సర్వైవర్ కావడం గమనార్హం. 2018లో ఆమె రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. అదృష్టవశాత్తూ త్వరగా క్యాన్సర్‌ను గుర్తించి చికిత్స తీసుకోవడంతో ఆమె కోలుకుని మామూలు మనిషి అయింది. ఇప్పుడు దర్శకురాలిగా మారి సినిమా కూడా తీయబోతోంది. మరి ఈ ప్రయత్నంలో ఆమె ఏ మేర విజయం సాధిస్తుందో చూడాలి.