నిర్మాతనైనందుకు గర్వపడుతున్నా: అవికా గోర్

హీరోయిన్లుగా ఓ స్థాయికి చేరుకున్నాకే వేరే క్రాఫ్ట్స్‌ మీద దృష్టి పెడతారు ఎవరైనా. కానీ నటిగా ఇంకా సెటిల్ కాకముందే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ఆశ్చర్యపర్చింది అవికా గోర్. గంధం మురళి నాగశ్రీనివాస్ అనే కొత్త దర్శకత్వంలో ఓ సినిమాని నిర్మిస్తున్నట్టు ఫిబ్రవరి నెలలో ప్రకటించింది. ఇప్పుడా చిత్రాన్ని కంప్లీట్ చేసినట్టు అనౌన్స్ చేసింది.

‘చిన్నారి పెళ్లికూతురు’గా తెలుగునాట ఫేమస్ అయిన అవిక.. ‘ఉయ్యాల జంపాల’ లాంటి మంచి ప్రాజెక్ట్‌తో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి మరికొన్ని సక్సెస్‌ఫుల్ సినిమాల్లోనూ కనిపించింది. కానీ ఏవో వ్యక్తిగత కారణాల వల్ల కావాలనే కొన్నాళ్లు గ్యాప్‌ తీసుకుంది. తర్వాత స్లిమ్‌గా తయారై, సరికొత్తగా రీ ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్‌గా ‘నెట్’ మూవీతో ఓటీటీలో పలకరించింది. త్వరలో నాగచైతన్యతో కలిసి ‘థాంక్యూ’ మూవీతో రాబోతోంది.

ఆమె చేతిలో మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒక మూవీలో లీడ్ రోల్ చేస్తూ నిర్మిస్తోంది అవిక. ఆమెకి జోడీగా సాయి రోనక్ నటిస్తున్నాడు. రీసెంట్‌గా షూటింగ్ కంప్లీటవడంతో చాలా ఎక్సయిటవుతోంది అవిక. ‘మొదటిసారి ప్రొడ్యూస్ చేస్తూ ఉండటం ఓ గొప్ప అనుభవం. ఇది నాకు నటిగా మరింత సహనాన్ని నేర్పించింది. వ్యక్తిగా ఎలా ఎదగాలో కూడా చెప్పింది. నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాను’ అంటోంది అవికా. ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య అనుబంధం ఏర్పడటం, ఆ తర్వాత వాళ్లు అనుకోకుండా ఓ సమస్యలో చిక్కుకోవడం, దాన్నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. మరి నిర్మాతగా అవిక ఫస్ట్ ప్రాజెక్ట్‌ ఎంత స్పెషల్‌గా ఉంటుందో చూడాల్సిందే.