అయితే మోహన్ బాబు మాట్లాడడా?


మంచు ఫ్యామిలీ ఇప్పుడు పట్టరాని ఆనందంలో మునిగిపోయింది. మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఘనవిజయం సాధించడమే అందుక్కారణం. తన పిల్లలు సినిమాల్లో అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోవడం పట్ల అసంతృప్తితో ఉన్న మోహన్ బాబుకు విష్ణు సాధించిన ఈ విజయం ఎంతో ఉత్సాహాన్నిచ్చేదే. నిన్నటి ప్రెస్ మీట్లో మోహన్ బాబు ముఖం చూస్తేనే ఆయనెంత ఆనందంగా ఉన్నారో అందరికీ అర్థమైంది. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు వివిధ అంశాలపై మాట్లాడారు.

ఈ క్రమంలో ఆయనకో ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ‘రిపబ్లిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మోహన్ బాబు ప్రస్తావన తేవడం, టికెట్ల ధరలు ఇతర సమస్యలపై ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేయడం తెలిసిందే. దీనిపై మోహన్ బాబు అప్పుడు స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ అడిగిన ప్రతి ప్రశ్నకూ తాను సమాధానం ఇస్తానని, ఐతే ‘మా’ ఎన్నికలు ముగిసే వరకు ఆగాలని, 11వ తేదీన అన్నింటికీ బదులిస్తానని అన్నారు.

ఈ నేపథ్యంలో పవన్ గురించి మోహన్ బాబు ఏం మాట్లాడతారా అని అందరూ ఎదురు చూశారు. కానీ ఈ విషయం ప్రస్తావిస్తే మోహన్ బాబు అసలు సంగతి పక్కన పెట్టేశారు. పవన్ కళ్యాణ్‌కు చురకలంటించేలా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. “మాట్లాడేదానికి ఎక్కడా అవకాశం లేక, ఎక్కడో ఒక వేదిక దొరికితే ఇష్టమొచ్చినట్లు నోరు జారడం మనిషిని దీనస్థితికి దిగజారుస్తుంది”.. “నేను మాట్లాడాల్సి వస్తే చాలా ఉంది మాట్లాడ్డానికి. కానీ మాట్లాడను” అంటూ మోహన్ బాబు చేసిన కామెంట్లు పవన్ వ్యాఖ్యల్ని ఉద్దేశించే అని భావిస్తున్నారు.

పవన్ రిపబ్లిక్ మూవీ ఈవెంట్లో రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టడమే కాక.. అతను తనకు సంధించిన ప్రశ్నలకు ఇప్పుడు తాను సమాధానం ఇవ్వబోనని మోహన్ బాబు చెప్పకనే చెప్పినట్లున్నారు. మరి పవన్ అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇస్తానని అప్పుడు మోహన్ బాబు ఎందుకన్నట్లు? ఇప్పుడెందుకు తగ్గినట్లు? బహుశా ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని పొగిడినా.. లేదా విమర్శించినా.. ఏ విధంగా అయినా ఇబ్బందే అని మోహన్ బాబు తగ్గినట్లుగా కనిపిస్తోంది.