నిర్మాత మహేష్ కోనేరు మృతి!

ఇండస్ట్రీలో పేరున్న ప్రముఖ పీఆర్ఓ మహేష్ కోనేరు గుండెపోటుతో మరణించారు. ఇటీవల వైజాగ్ వెళ్లిన ఆయన కొన్నిరోజులుగా అక్కడే ఉంటున్నారు. ఈరోజు సడెన్ గా గుండెపోటు రావడంతో హాస్పిటల్ కి తరలించేలోపు ఆయన మరణించారు. ఈ విషయం సినీ, మీడియా వర్గాల్లో విషాదం నింపింది. మహేష్ కోనేరు చాలా ఏళ్లుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర పీఆర్ఓగా పని చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కు సంబంధించిన పనులతో పాటు కళ్యాణ్ రామ్ డేట్స్ కూడా చూసేవారు.

కానీ ఎన్టీఆర్ పీఆర్ఓగా ఆయన బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడిప్పుడే నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నారు. ‘118’, ‘మిస్ ఇండియా’, ‘తిమ్మరుసు’ వంటి చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేయాలనుకున్నారు కానీ ఇంతలోనే కాలం చేశారు. మహేష్ కోనేరు మరణ వార్త విన్న ఎన్టీఆర్ ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. షాక్ లో ఉన్నానని, మాటలు రావడం లేదని ఎన్టీఆర్ అన్నారు. మహేష్ కోనేరు ఫ్యామిలీకి సంతాపం తెలియజేశారు ఎన్టీఆర్.

రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై మహేష్ కోనేరు వివరణ కూడా ఇచ్చారు. ప్రమాదాలన్నింటికీ అతివేగం ఒక్కటే కారణం కాదని, సాయిధరమ్‌ తేజ్‌కు జరిగిన ప్రమాదం గురించి కొంతమంది మిడిమిడి జ్ఞానంతో కామెంట్లు చేస్తున్నారని ఆయన అన్నారు. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో బైక్‌ స్కిడ్‌ అయి యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చని అన్నారు. ఈ పోస్ట్ కూడా బాగా వైరల్ అయింది.