‘మా’ చరిత్రలోనే రికార్డ్ పోలింగ్


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఈసారి. ఈ ఎన్నికలను సినీ జనాలు ఇంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సందర్భం ఎప్పుడూ కనిపించలేదు. ఎన్నికల బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెళ్లు ఎంత విస్తృతంగా ప్రచారం చేశాయో.. పరస్పరం విమర్శలు, ఆరోపణలతో వాతావరణాన్ని ఎంతగా హోరెత్తించాయో అందరూ చూశారు.

ఈ ఎన్నికల్లో గెలవడాన్ని ఇరు ప్యానెళ్లు, వాటి మద్దతుదారులు చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకే ఎక్కడెక్కడో ఉన్న వాళ్లను కూడా రప్పించి ఓటు వేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుకున్నట్లుగానే ఈసారి రికార్డు పోలింగ్ జరగబోతోందని అర్థమైపోయింది. ఉదయం పదిన్నర ప్రాంతంలోనే దాదాపు మూడు వందల ఓట్లు పోల్ కావడం ఇందుకు నిదర్శనం. కాగా మధ్యాహ్నానికల్లా రికార్డు పోలింగ్ నమోదు కావడం విశేషం.

గతంలో ఎప్పుడూ ‘మా’ ఎన్నికల్లో పోలింగ్ 500 ఓట్లను దాటింది లేదు. కానీ ఈసారి మధ్యాహ్నం 2 గంటల సమయానికే 545 ఓట్లు పోల్ అయ్యాయి. ‘మా’లో ఉన్న మొత్తం ఓట్లు 900 పైచిలుకు. మధ్యాహ్నానికే 545 ఓట్లు పడ్డాయంటే పోలింగ్ 60 శాతాన్ని మించిపోయినట్లు. సాయంత్రం పొద్దు పోయే వరకు పోలింగ్ జరగనుంది. కాబట్టి ఇంకో వంద ఓట్లయినా పోల్ అవుతాయని అంచనా వేస్తున్నారు.

ఎన్నికల ముంగిట ఇండస్ట్రీ జనాలు చాలామంది అన్నదేంటంటే.. నాన్ లోకల్ వాళ్లను, ఇక్కడే ఉన్నా షూటింగుల్లో బిజీగా ఉండటం వల్లో, ఇతర కారణాల వల్లో ఓటు వేయని వాళ్లను మినహాయిస్తే 400 ఓట్లకు మించి పడకపోవచ్చని. కానీ అంచనాల్ని మించిపోయి ఇప్పటికే 545 ఓట్లు పడటం అనూహ్యం. ట్రాఫిక్ జామ్, ఇతర సమస్యల వల్ల ఇంకా కొంతమంది ఓటింగ్‌కు రాలేకపోతున్నారని.. ఎన్నికల అధికారి కావాల్సినంత టైం ఇస్తున్నారని.. కాబట్టి అందరూ వచ్చి ఓటు వెయ్యాలని మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా అభ్యర్థించాడు.