అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మా’ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ రోజు (ఆదివారం) ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ను షురూ చేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. గతానికి భిన్నంగా ఎన్నికల బరిలో నిలిచిన రెండుప్యానళ్లు పోటాపోటీగా ప్రచారం చేసుకోవటం.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయటంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
పోలింగ్ వేళ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం.. ఆయన ఓటు ఎవరికి వేశారన్న విషయాన్ని బయటకు చెప్పేందుకు నిరాకరించారు. తాను ఎవరికి మద్దతు ఇచ్చానన్న విషయాన్ని బయటకు చెప్పటం ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని చెప్పిన ఆయన.. అన్నయ్య చిరంజీవి.. మోహన్ బాబు మంచి స్నేహితులని.. వారి స్నేహబంధం మీద ‘మా’ ఎన్నికలు ఎలాంటి ప్రభావాన్ని చూపించవని చెప్పారు.
మా ఎన్నికలకు ఇంత హడావుడి అవసరం లేదన్న ఆయన.. ఈ ఎన్నికలతో సినిమా ఇండస్ట్రీ చీలిపోవటం అనేది ఉండదని స్పష్టం చేశారు. మా ఎన్నికల వేళ.. పవన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.