సోనూసూద్ ట్వీట్ పై నెటిజన్ల ఘాటు స్పందన!

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. శనివారం ముంబై తీరంలో క్రూజ్ షిప్ పై దాడి చేసిన పోలీసులు ఆర్యన్ తో పలువురి అరెస్ట్ చేశారు. ఈ దాడిలో పోలీసులు పలు రకాల నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయంలో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ ఖాన్ కి మద్దతుగా నిలుస్తున్నారు. సల్మాన్ ఖాన్, సునీల్ శెట్టి, పూజాభట్ లతో పాటు పలువురు తారలు షారుఖ్ కి తమ మద్దతుని తెలియజేశారు.

తాజాగా సోనూసూద్, హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ లు సైతం షారుఖ్ కి మద్దతుగా నిలిచారు. ఆర్యన్ కు ముంబై కోర్టు బెయిల్ నిరాకరించి అక్టోబర్ 7వరకు ఎన్సీబీ కస్టడీలో ఉండాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలో ఆర్యను పేరు ప్రస్తావించకుండా.. సోనూసూద్ హిందీలో ఓ ట్వీట్ చేశాడు. పిల్లలు చాలా విలువైన వారని.. నిజానిజాలు బయటకు రావడానికి కాస్త సమయం పడుతుందని.. అప్పుడే మీరు దేవుడిలా పరిస్థితిని మీ చేతిలో తీసుకోవద్దని రాసుకొచ్చారు. ఇలాంటి సమయంలో ఒకరికొకరు అండగా ఉండాలని సోనూసూద్ పేర్కొన్నారు.

సోనూసూద్.. ఆర్యన్ ను ఉద్దేసిందే ఈ ట్వీట్ చేశారని భావించిన నెటిజన్లు కొందరు అతడిపై మండిపడుతున్నారు. 23 ఏళ్లకు కపిల్ దేవ్ వరల్డ్ కప్ గెలిచాడని.. భగత్ సింగ్ దేశం కోసం ప్రాణత్యాగం చేశాడని.. నీరజ్ చోప్రా ఒలింపిక్స్ లో గెలిచాడని.. అలాంటిది 23 ఏళ్లకు ఆర్యన్ చిన్నపిల్లాడా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. 23 ఏళ్లకు అతడు రేవ్ పార్టీలకు వెళ్లాడంటే ఏంటో అర్ధమవుతుంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. జనాలు అంత పిచ్చివాళ్లు కాదని.. ఆర్యన్ ను మంచివాడిలా చూపించే ప్రయత్నాలు మానుకోండి అంటూ సలహాలు ఇస్తున్నారు.