మనోజ్‌ బాజ్‌పాయ్ ఇంట తీవ్ర విషాదం!

బాలీవుడ్ తో పాటు నటుడిగా కొన్ని తెలుగు సినిమాల్లో కూడా కనిపించారు మనోజ్‌ బాజ్‌పాయ్. సినిమాలతో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు. ఈ సిరీస్ మొదటి సీజన్ 2019లో విడుదల కాగా.. రెండో సీజన్ ఈ ఏడాది జూన్ లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో సమంత కీలకపాత్ర పోషించింది. ఇదిలా ఉండగా.. తాజాగా మనోజ్‌ బాజ్‌పాయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

ఆయన తండ్రి ఆర్కే బాజ్‌పాయ్(83) ఆదివారం నాడు కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన్ను ఢిల్లీలోని ఓ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ ఆదివారం నాడు కన్నుమూశారు. షూటింగ్ కోసం కేరళ వెళ్లిన మనోజ్ బాజ్‌పాయ్ తండ్రి మరణవార్త తెలుసుకొని ఢిల్లీకి వెళ్లారు. ఈ సమయంలో తనకు, తన కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలని మీడియాను కోరారు మనోజ్ బాజ్‌పాయ్.

మనోజ్ కి తన తండ్రితో మంచి అనుబంధం ఉంది. కొడుకు ఉన్నత చదువులు చదవాలని ఆయన ఆశ పడేవారని.. ఆయన కోసం ఢిల్లీ యూనివర్సిటీలో చేరి డిగ్రీ పట్టాపొందానని గతంలో మనోజ్ చెప్పారు. అలానే తండ్రి చాలా బాగా వంట చేస్తారని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టేవారు. మనోజ్ బాజ్‌పాయ్ తండ్రి మరణవార్త విన్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.