మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ప్రచారాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఓ పక్క మంచు విష్ణు ప్యానెల్, మరోపక్క ప్రకాష్ రాజ్ ప్యానెల్ ‘నువ్వా నేనా’ అన్నట్లుగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. రీసెంట్ గా ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ ప్రెస్ మీట్ పెట్టి మరీ మంచు విష్ణుకి మద్దతు తెలిపారు. ఇదే సమయంలో ప్రకాష్ రాజ్ ని తక్కువ చేస్తూ కొన్ని మాటలు కూడా ఉన్నారు. విష్ణు కూడా ప్రకాష్ రాజ్ పై సెటైర్లు వేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ తనను ఏదొకటి అనాలని విమర్శలు చేయడం కరెక్ట్ కాదని మండిపడ్డారు ప్రకాష్ రాజ్.
ఈ వివాదాల మధ్య అక్టోబర్ 10న జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ గెలవాలని కోరుకుంటున్నట్లు నటి పూనమ్ కౌర్ తెలిపారు. అప్పుడే ఇంతకాలం తాను ఎదుర్కొన్న సమస్యలను చెప్పగలిగే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ తో కలిసి తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.
“మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ సర్ గెలవాలని కోరుకుంటున్నాను. ఆయన విజయం సాధిస్తే ఇంతకాలం నేను ఎదుర్కొన్న సమస్యలను బయటపెడతాను. ఆయన చిల్లర రాజకీయాలు చేయరు” అని రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ‘మా’ అసోసియేషన్ నీకు న్యాయం చేయదని.. పోలీసులను సంప్రదించమంటూ నెటిజన్లు పూనమ్ కి సలహాలు ఇస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates