వచ్చారా? ఎవరైనా తెచ్చారా?


అక్టోబర్ 10న మా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మంచు విష్ణు, ప్రకాష్‌ రాజ్, సీవీఎల్ నరసింహరావులతో పాటు బండ్ల గణేష్ కూడా అధ్యక్ష పదవికి పోటీపడుతున్నాడు. ఈ క్రమంలో పోటీదారులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. రీసెంట్‌గా నామినేషన్ వేసిన మంచు విష్ణుకు మద్దతుగా ఇవాళ ఓ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది తన ప్యానెల్. ఈ సమావేశంలో వీకే నరేష్‌ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

అధ్యక్ష పదవిని చేపట్టే సామర్థ్యం ఇక్కడ ఎవరికీ లేదని ప్రకాష్ రాజ్ అన్నారని, ఆ మాటలు ఆయన వెనక్కి తీసుకోవాలని నరేష్ డిమాండ్ చేశారు. తాను ఎన్నో యేళ్లుగా ‘మా’లో ఉన్నానని, ‘మా’ మసకబారుతున్న సమయంలో తాను అసోసియేషన్ కోసం నిలబడ్డానని, ఇప్పుడు మీడియా ముందుకొచ్చి ప్రకాష్ రాజ్ టీమ్ అబద్ధాలు చెబుతోందని అన్నారు. అసలు ‘మా’కి అధ్యక్షుడయ్యే అర్హత ప్రకాష్‌ రాజ్‌కి లేదని, ఎవడు పడితే వాడొచ్చి పదవిలో కూర్చుంటే ‘మా’ మసకబారడం కాదు, ‘మా’కి అదో మచ్చగా మిగిలిపోతుందని అన్నారాయన. ఇన్నేళ్లలో ఎప్పుడైనా మా సమావేశాలకి వచ్చారా, ఎన్నికల్లో ఓటు వేశారా, ఒక్క మా సభ్యుడికైనా ఫోన్ చేసి బర్త్‌ డే విషెస్ చెప్పారా, మరి ఇప్పుడెందుకు ఇంత ప్రేమ వచ్చేసింది, అసలు మీరు మీకుగా వచ్చారా లేక మిమ్మల్ని ఎవరైనా తెచ్చారా అంటూ ప్రకాష్ రాజ్‌ని సూటిగా ప్రశ్నించారు నరేష్.

‘మా అనేది రాజకీయ వేదిక కాదు. సడెన్‌గా ఆర్నెల్ల క్రితం పోటీ అంటూ వచ్చారు ప్రకాష్‌ రాజ్‌. కానీ విష్ణు అలా కాదు. ఇక్కడే పుట్టి పెరిగాడు. వారి కుటుంబం ఇండస్ట్రీకి ఫుడ్ పెట్టింది. అందుకే నా మద్దతు తనకే. విష్ణు ఓ బ్రాండ్. తను ఈ పదవికి అర్హుడు. ఏదైనా సమస్య వస్తే పోరాడతాడు తప్ప పారిపోడు. అందుకే నేను తన రథం ఎక్కుతున్నాను. కృష్ణుడి పాత్ర పోషిస్తాను’ అని చెప్పారు నరేష్. సొంత చెల్లెల్లా చూసిన జీవిత.. తాను ఉంటే ప్యానెల్‌లో ఉండనని చెప్పడం చాలా బాధను కలిగించిందని చెప్పిన నరేష్.. ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో ఆమె సపోర్ట్ లేకపోవడం వల్లే ఇప్పటికీ అప్లికేషన్లు అలా పడి ఉన్నాయంటూ విమర్శించారు. తమలో ఎవ్వరికీ పదవీ వ్యామోహం లేదని, సంక్షేమమే తమ ప్యానెల్ లక్ష్యమని ప్రకటించారు.