ప‌వ‌న్ ప్ర‌సంగం చూసిన తేజు

మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు, టాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి ఆసుప‌త్రి పాలై దాదాపు 20 రోజులు గ‌డుస్తోంది. ఇంకా అత‌ను హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ కాలేదు. వారం రోజుల పాటు ఐసీయూలో ఉండ‌టం, కొన్ని రోజులు వెంటిలేట‌ర్ ద్వారా చికిత్స తీసుకోవ‌డం, ఒక శ‌స్త్ర‌చికిత్స కూడా చేయాల్సిన అవ‌స‌రం ప‌డిందంటే అత‌డికి అయిన‌ గాయాలు తీవ్ర‌మైన‌వేన‌ని భావిస్తున్నారు.

మొన్న‌టి రిప‌బ్లిక్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ తేజు ఇంకా కోమాలోనే ఉన్నాడ‌న్న కామెంట్ అంద‌రినీ అయోమ‌యానికి గురి చేసింది. ఐతే నిజానికి తేజు చాలా రోజుల ముందే తెలివిలోకి వ‌చ్చాడ‌న్న‌ది మెగా ఫ్యామిలీ వ‌ర్గాల స‌మాచారం. ఈ విష‌యాన్ని తేజుతో రిప‌బ్లిక్ మూవీ తీసిన ద‌ర్శ‌కుడు దేవా క‌ట్టా కూడా ధ్రువీక‌రించాడు. రిప‌బ్లిక్ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను తేజు చూసిన‌ట్లు దేవా చెప్ప‌డం గ‌మ‌నార్హం.

యాక్సిడెంట్ అయ్యాక తాను తేజును క‌లిసిన‌ట్లు దేవా క‌ట్టా వెల్ల‌డించాడు. అక్టోబ‌ర్ 1న సినిమాను విడుద‌ల చేద్దామ‌ని త‌న‌తో మాట్లాడుకున్న త‌ర్వాతే ఫైన‌ల్‌గా ఓకే చేశామ‌ని.. మొన్న‌టి ప్రి రిలీజ్ ఈవెంట్‌ను తేజు చూశాడ‌ని దేవా చెప్పాడు. తేజు ఆరోగ్యం మెరుగు ప‌డ్డ‌ప్ప‌టికీ.. అత‌ను నూటికి నూరుశాతం ఓకే అనుకునే వ‌ర‌కు ఐసోలేష‌న్‌లో ఉంటే మంచిద‌ని భావించి ఆసుప‌త్రిలోనే కొన‌సాగుతున్న‌ట్లు దేవా చెప్పాడు.

తేజు త్వ‌ర‌గా కోలుకుంటున్నాడని.. మాట్లాడుతున్నాడని.. కాస్త కాస్త ఆహారం కూడా తీసుకుంటున్నాడని.. అత‌ను పూర్తిగా రిక‌వ‌ర్ కావ‌డానికి మ‌రికొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని దేవా వెల్ల‌డించాడు. దేవా చెప్పిన మాట‌ల్ని బ‌ట్టి ఇక తేజు ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళ‌న అవ‌స‌రం లేన‌ట్లే. అత‌ను ప్రి రిలీజ్ ఈవెంట్ చూశాడంటే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫైర్ బ్రాండ్ స్పీచ్‌ను కూడా వీక్షించాడ‌న్న‌మాటే. మ‌రి కోలుకున్నాక దీనిపై అత‌నెలా స్పందిస్తాడో చూడాలి.