ఓవైపు పవన్ కళ్యాణ్, పోసానిల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దీనివల్ల ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిపోయిందనే కామెంట్స్ వినబడుతున్నాయి. అయితే ఎవరూ నేరుగా ఈ విషయంపై రియాక్ట్ కావడం లేదు. ఏం మాట్లాడితే ఏమవుతుందో, ఈ వ్యవహారం ఎటు పోతుందో అనే భయంతో ఎవరూ నోరు మెదపట్లేదు. ఈ క్రమంలో నాగార్జున మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
తన కొడుకు నాగచైతన్య నటించిన లవ్‌స్టోరీ సక్సెస్ మీట్లో పాల్గొన్నారు నాగార్జున. సినిమా సక్సెస్ గురించి, చైతుకి వచ్చిన మంచి పేరు గురించి తన సంతోషాన్ని పంచుకున్నారు. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకూ ఆయనొక విజ్ఞప్తి చేశారు.
తెలుగు ప్రేక్షకులు సినిమాని ఎంతో ప్రేమిస్తారని, అందుకే తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల దీవెనలు తమ పరిశ్రమకి ఎంతో అవసరమని నాగ్ అన్నారు. రెండు ప్రభుత్వాలూ తమకు ఎంతగానో సహకరించాయని, భవిష్యత్తులో కూడా వారి చల్లని చూపు తమపై ఉండాలని ఆయన అన్నారు.
నాగ్ మాటలు క్షణంలో వైరల్ అయ్యాయి. అటు పవన్‌కి మద్దతిచ్చినట్టు కాకుండా, ఆయన్ని నేరుగా వ్యతిరేకిస్తున్నట్టూ చేయకుండా భలే మాట్లాడారంటూ మెచ్చుకుంటున్నారు. తాను కూడా పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదన్నట్టుగానే నాగ్ మాట్లాడారనేది వాస్తవం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ గవర్నమెంట్ సాయం కూడా ఇండస్ట్రీకి చాలా అవసరం. అలాగే చిరంజీవితో నాగ్‌కి చాలా మంచి అనుబంధం ఉంది. కాబట్టి పవన్ ఆయనకి ఆప్తుడు అందుకే కర్ర విరగకుండా, పాము చావకుండా నాగ్ తెలివిగా వ్యవహరించారని అందరూ అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates