జనసేనాని పవన్ కళ్యాణ్ మొన్నటి ‘రిపబ్లిక్’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో చేసిన ప్రసంగం రాజకీయంగా ఎంతటి ప్రకంపనలు రేపిందో తెలిసిందే. సినిమా వేడుక కదా సినిమా విషయాలు మాత్రమే మాట్లాడతాడని.. మహా అయితే ఏపీలో టికెట్ల రేట్లు లాంటి సమస్యల్ని ఒకసారి ప్రస్తావించి వదిలేస్తాడని అంతా అనుకున్నారు.
కానీ ఎవ్వరూ ఊహించని విధంగా పవన్ వైసీపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడిపోయాడు. దాదాపు గంట పాటు సుదీర్ఘ ప్రసంగం చేశాడు. పవన్ ప్రసంగాన్ని గమనిస్తే అతను ముందుగా బాగా ప్రిపేరయ్యే వచ్చాడని.. వ్యూహాత్మకంగానే వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేశాడని స్పష్టం అయ్యింది. పవన్ ఎంత తెలివిగా వ్యవహరించాడంటే.. అతడి పట్ల వ్యతిరేకతతో ఉండే మీడియా సంస్థలు సైతం మునుపెన్నడూ లేని స్థాయిలో కవరేజీ ఇవ్వాల్సిన పరిస్థితి కల్పించాడు.
పవన్ ప్రసంగాన్ని కవర్ చేయకపోయినా సరే.. తర్వాత పవన్‌ను టార్గెట్ చేస్తూ వైసీపీ నాయకులు, మద్దతుదారులు చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం కల్పించడం ద్వారా జనసేనానికి విస్తృత స్థాయిలో కవరేజీ ఇచ్చారు. దీంతో మూడు రోజులుగా అన్ని రకాల మీడియాల్లోనూ పవన్ వార్తాంశంగా మారాడు. మామూలుగా జనసేన వాళ్ల బాధ ఏంటంటే.. తమ కార్యక్రమాలకు ప్రధాన మీడియాలో అసలేమాత్రం కవరేజీ ఉండదని. పవన్ ఏ సభ పెట్టినా.. ఎక్కడ మాట్లాడినా.. ఎంత మంచి ప్రసంగం చేసినా.. ప్రత్యర్థులపై ఎంత పదునైన విమర్శలు చేసినా.. మీడియాలో సరైన ప్రాధాన్యం దక్కదు.
జగన్, చంద్రబాబులకు ఇచ్చే ప్రాధాన్యంలో కొంత మేర కూడా పవన్‌కు ఇవ్వరంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. కానీ మంచి సందర్భం చూసుకుని, హాట్ హాట్ కామెంట్లు చేయడం ద్వారా మీడియా తనను విస్మరించలేని పరిస్థితి కల్పించాడు. ఇక ఇటు వైపు పవన్ ఒక్కడు మాట్లాడితే.. అటు వైసీపీ నుంచి మంత్రులు ముగ్గురు ఆయన్ని టార్గెట్ చేశారు. వేరే నాయకులు కూడా పవన్ మీద పడిపోయారు. వీళ్లకు తోడు ఆ పార్టీ మద్దతుదారు అయిన పోసాని కృష్ణమురళి కూడా వచ్చాడు. కానీ వారిలో ఎవరికీ కూడా పవన్‌ను ఎదుర్కోవడంలో సరైన వ్యూహం లేదని వారి మాటల్ని బట్టి చూస్తే అర్థమవుతుంది.
పైగా ఒక్కడిని ఎదుర్కోవడానికి ఇంతమందా అన్న ఆలోచన జనాల్లో కలిగింది. అసలు పవన్‌కు వైసీపీ ఇంత ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆయన స్థాయిని పెంచిందన్నది గమనార్హం. ఇది వారి భయానికి నిదర్శనం అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. పవన్ చాలా అగ్రెసివ్‌గా మాట్లాడటం, తర్వాత ట్విట్టర్లోనూ అదే దూకుడు ప్రదర్శించడం జనసైనికులకు మంచి ఉత్సాహాన్నిచ్చింది. మొత్తానికి పవన్ మొన్నటి ప్రసంగం తాలూకు ప్లాన్ సూపర్ సక్సెస్ అనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates