ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్లపై నియంత్రణ, నైట్ షోలకు అనుమతులివ్వకపోవడం, ప్రభుత్వమే ఆన్ లైన్ ద్వారా టికెట్ల అమ్మకానికి సిద్ధపడటం లాంటి నిర్ణయాలపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడో తెలిసిందే. తన మీద కక్ష సాధింపులో భాగంగా ఏపీ సర్కారు తెలుగు సినీ పరిశ్రమను ఇబ్బంది పెడుతోందని పవన్ విరుచుకుపడ్డాడు. పరిశ్రమలోని అందరూ దీనిపై గళం విప్పాలని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని పిలుపునిచ్చాడు.
ఐతే పవన్ పిలుపుకు ఇండస్ట్రీ నుంచి మాత్రం ఆశించిన స్పందన కనిపించడం లేదు. యంగ్ హీరోలు నాని, కార్తికేయ మినహా ప్రముఖులెవరూ దీనిపై స్పందించలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్.. పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నట్లుగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీదే కాక.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా ఫిలిం ఛాంబర్ ప్రశంసలు కురిపించింది.
సినీ పరిశ్రమకు సంబంధించి సమస్యలపై ఏపీ మంత్రి పేర్ని నానితో సమావేశం గురించి ప్రస్తావిస్తూ.. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం పట్ల ఎంతో సానుకూలంగా స్పందించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వాలు తమకు పూర్తి సహకారం అందిస్తున్నాయని.. వాటి సహకారం లేకుంటే తాము మనగలిగే వాళ్లం కాదని ఈ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు.
కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుంచి సినిమాల మీద ఆధారపడ్డ కుటుంబాలు చాలా కష్టపడుతున్నాయని.. ఈ కష్ట కాలంలో ప్రభుత్వాలు పెద్ద మనసుతో తమకు సహకరిస్తున్నాయని.. సినీ పరిశ్రమకు రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లని.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ సినీ పరిశ్రమ పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ మద్దతుగా నిలుస్తున్నారని.. వారి మద్దతు, ఆశీర్వాదం కొనసాగాలని కోరుకుంటున్నామంటూ ఈ ప్రెస్ నోట్‌ను ముగించారు. ఎక్కడా పవన్ ప్రస్తావన లేకపోయినా.. అతడి ప్రసంగం నేపథ్యంలోనే ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారని, ఆ వ్యాఖ్యలతో తమకేమీ సంబంధం లేదని చెప్పదలుచుకున్నారని స్పష్టమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates