ఈ సీన్లో మహేష్ ఉంటే బాగుండేదే

సూపర్ స్టార్ మహేష్ బాబుకు తన తల్లిదండ్రులు కృష్ణ, ఇందిరల మీద ఎంతటి ప్రేమాభిమానులున్నాయో తెలిసిందే. వారి పుట్టిన రోజులప్పుడు, ఇతర సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా వారిపై తన ప్రేమను బయటపెడుతుంటాడు మహేష్. ఐతే తండ్రిని, తల్లిని మహేష్ విడివిడిగా కలిసినపుడు ఫొటోలు కనిపిస్తుంటాయి కానీ.. వాళ్లిద్దరూ ఉన్న ఫొటోలో మహేష్ కనిపించడం అరుదు. అలా కనిపించే అవకాశం ఇప్పుడొచ్చింది కానీ.. అక్కడ మహేష్ లేడు.

ఆదివారం కృష్ణ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కృష్ణ సతీమణి ఇందిర ఆయన్ని కలవడం విశేషం. ఇంతకుముందు పుట్టిన రోజులప్పుడు కృష్ణ పక్కన విజయ నిర్మల ఉండటం వల్లో ఏమో ఆమె ఆయన దగ్గరికెళ్లేవారు కాదు. ఐతే ఇప్పుడు ఆమె లేకపోవడంతో తన కూతుళ్లతో కలిసి ఇందిర కృష్ణ దగ్గరికెళ్లారు.

కృష్ణ ముగ్గురు కూతుళ్లతో పాటు అల్లుడు సుధీర్ బాబు, అతడి పిల్లలు, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ఆదివారం ఆయన ఇంటికెళ్లారు. అందరూ ఆయనతోనే రోజంతా గడిపారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు కృష్ణ ఆల్ టైం హిట్ మూవీ ‘అల్లూరి సీతారామరాజు’లోని ఓ సన్నివేశాన్ని మొబైల్ ద్వారా కృష్ణకు చూపించాడు.

ఈ వీడియోను ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాడు. దీంతో పాటు ఫ్యామిలీ గ్రూప్ ఫొటోను కూడా షేర్ చేశాడు. ఇందులో అందరూ ఉన్నారు కానీ.. మహేష్, అతడి భార్యా పిల్లలు లేని లోటు కనిపించింది. తల్లిదండ్రులిద్దరితో కలిసి మహేష్ చాలా కాలానికి ఒకే ఫ్రేమ్‌లో కనిపించే అవకాశం అభిమానులు మిస్సయ్యారు. మహేష్ షేర్ చేసే తల్లి ఫొటోలు చాలా పాతవని తాజా ఫొటోలో ఆమెను చూస్తే అర్థమవుతోంది. వయసు బాగా మీద పడి, అనారోగ్య సమస్యలతో ఆమె వీల్ చైర్‌కు పరిమితం అయినట్లున్నారు.