శివ నిర్వాణ యు టర్న్

నిన్ను కోరి, మజిలి లాంటి లవ్‌స్టోరీస్‌తో మంచి మార్కులు వేయించుకున్న శివ నిర్వాణ.. జానర్‌‌ మార్చి ‘టక్‌ జగదీష్’ తీసి దెబ్బ తిన్నాడు. ఫీల్‌ గుడ్ లవ్‌స్టోరీస్‌ చూపించినట్టు ఈసారి ఓ ఫీల్‌ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌ను చూపిస్తాడని ఆశపడిన ఆడియెన్స్కి నిరాశే మిగిలింది. దాంతో మళ్లీ తనకు అలవాటైన జానర్‌‌కి వెళ్లిపోతున్నాడు శివ.

అతని నెక్స్ట్ మూవీ కూడా ఓ ప్రేమకథేనని, తనకెంతో ఇష్టమైన వైజాగ్ బీచ్‌లో కూర్చుని కథ రాస్తున్నానని చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. సముద్ర కెరటాలు ఎంత సహజంగా ఉంటాయో తన సినిమా కూడా అంతే సహజంగా ఉంటుందన్నాడు. అంతవరకు బానే ఉంది కానీ ఎన్‌ఎన్‌4 అని హ్యాష్‌ట్యాగ్‌ ఇవ్వడం వల్లే కొత్త డౌట్స్ మొదలయ్యాయి. నిజానికి శివ తన నెక్స్ట్‌ మూవీ విజయ్ దేవరకొండతో చేయాల్సి ఉంది. నా తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుంది, అదో మంచి ఫన్ ఎంటర్‌‌టైనర్‌‌ అని గతంలో తను చెప్పాడు కూడా.

‘లైగర్‌‌’ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో వీళ్లిద్దరి కాంబోలో మూవీ త్వరలోనే సెట్స్కి వెళ్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు నాలుగో సినిమా కోసం ప్రేమకథ రాస్తున్నానని శివ అనడంతో దేవరకొండ సినిమా వాయిదా పడిందా లేక పూర్తిగా ఆగిపోయిందా అనే సందేహాలు మొదలయ్యాయి. టక్ జగదీష్ రిజల్ట్ చూశాక దేవరకొండ మనసు మార్చుకున్నాడని, అందుకే నాగచైతన్యతో శివ సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడని, తన కోసమే ఈ కథ రాస్తున్నాడని ఆల్రెడీ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అది నిజమో కాదో శివయే చెప్పాలి మరి.