కాజల్‌ ప్లేస్‌లో జాక్వెలిన్.. నిజమేనా?

కెరీర్ స్టార్ట్ చేసి పద్నాలుగేళ్లు దాటినా టాప్ హీరోయిన్‌గానే వెలుగుతోంది కాజల్. పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్ కంటిన్యూ చేసింది. ఇండియన్ 2, ఆచార్య, ద ఘోస్ట్ లాంటి భారీ చిత్రాలతో పాటు ఉమ, హే సినామికా లాంటి ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలకూ బెస్ట్ చాయిస్‌గా నిలిచింది. అయితే రీసెంట్‌గా ఆమె ‘ద ఘోస్ట్’ మూవీ నుంచి తప్పుకుందని తెలుస్తోంది. ఆ స్థానంలో ఇలియానాని తీసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇలియానా ఇప్పుడు ఫామ్‌లో లేదు. టాలీవుడ్‌లో ఆమె ఫాలోయింగ్ పూర్తిగా తగ్గిపోయింది కూడా. అందుకే జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని ఫైనల్ చేశారని అంటున్నారు.

అసలిప్పుడీ మార్పు ఎందుకంటే.. కాజల్ తల్లి కాబోతోందని తెలియడమే. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌లో నాగ్‌తో పాటు కాజల్‌ కూడా పవర్‌‌ఫుల్ రోల్ చేస్తోంది. ఆమె స్టంట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ కావడంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక కాజల్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట.

అయితే తాను కన్సీవ్ అయినట్టు కాజల్ ఇంతవరకు క్లూ ఇవ్వలేదు. టీమ్ కూడా పాత హీరోయిన్ తప్పకుందని కానీ, కొత్త హీరోయిన్‌ని తీసుకుంటున్నామని కానీ కన్‌ఫర్మ్ చేయలేదు. దాంతో అసలిది ఎంతవరకు కరెక్ట్ అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ నిజమే అయితే జాక్వెలిన్‌ మంచి చాయిస్ అనే చెప్పాలి.

గొప్పగా చెప్పుకునే విజయాలైతే లేవు కానీ జాక్‌కి క్రేజ్ మాత్రం కావలసినంత ఉంది. సోషల్‌ మీడియాలోనూ హాట్ ఫొటోస్‌తో యూత్ మతులు పోగొడుతూనే ఉంటుంది. అదే ఆమెకి సౌత్‌లో కూడా అవకాశాలు తెచ్చిపెడుతోంది. సుదీప్‌తో ‘విక్రాంత్ రోనా’లో నటిస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’లోనూ కనిపించబోతోంది. ఇప్పుడు నాగ్‌ సరసన కూడా చాన్స్ కొట్టిందంటే ఇక దక్షిణాదిన కూడా చక్రం తిప్పడం ఖాయం.