‘బుల్లెట్టు బండి’ని ఇవ్వమంటే.. నో చెప్పేస్తుందట

సోషల్ మీడియా జమానాలో కొన్ని సిత్రాలు అలా జరిగిపోతుంటాయి. గడిచిన నాలుగు నెలలుగా తెలుగు వారి నోటి మీద తరచూ వినిపిస్తున్న పాట ‘బుల్లెట్టు బండి’. పెండ్లి కూతురు ఈ పాటకు వేసిన స్టెప్పులు.. అవి కాస్తా సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున షేర్ కావటం.. అది కాస్తా వైరల్ గా మారటమే కాదు.. ఎక్కడ చూసినా..ఆ పాట ఇప్పుడు మస్తు ఫేమస్ కావటం తెలిసిందే. దీంతో.. ఈ ఫోక్ సాంగ్ ను సొంతం చేసుకోవటానికి పెద్ద పెద్ద ఆఫర్లతో వెళుతున్నారు..

మోహనా భోగరాజు పాడిన ఆ పాటకు.. లక్ష్మణ్ సాహిత్యం అందించగా.. ఎస్ కె బాజీ సంగీతాన్ని ఇచ్చారు. ఏప్రిల్లో విడుదలైన ఈ పాటకు ఆదరణ లభించినా.. పెండ్లి కుమార్తె తన బరాజ్ సందర్భంగారోడ్డు మీద స్టెప్పులు వేయటంతో.. ఈ పాట మరో లెవల్ కు వెళ్లింది. ఇప్పటికే 92 మిలియన్ల వ్యూస్ తెచ్చుకున్న ఈ పాటను తమ సినిమాలో వాడేయాలని పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట.

ఆన్ లైన్ లో టాప్ లేపుతున్న ‘బుల్లెట్టుబండి’ పాటను సొంతం చేసుకోవటానికి చాలామంది ప్రయత్నిస్తున్నా.. మోహనా మాత్రం నోఅంటే నో చెప్పేస్తున్నారు. ఎంతో కష్టపడిన చేసిన ఈ పాటను తమ యూట్యూబ్ చానల్ లో ఒక మంచి గురుతుగా ఉండిపోవాలే తప్పించి.. ఎవరికో కట్టబెట్టేందుకు ఆమె ఇష్టపడటం లేదు. ఈ క్రేజీ ‘బుల్లెట్టు బండి’ని సొంతం చేసుకుంటే.. తమ సినిమాకు చక్కటి ప్రచారంగా మారుతుందన్న ఆలోచనకు.. గాయని మోహనా మాత్రం నో అన్న మాటతో బ్రేకులు వేస్తున్నారట. ఫ్యాన్సీ ఆఫర్ కు సైతం ససేమిరా అనటం గమనార్హం.