వెబ్ సిరీస్‌ల పట్ల ఇండియాలో అందరి దృక్పథమూ మారిపోయింది గత రెండేళ్లలో. కరోనా టైంలో మన ప్రేక్షకులు నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లాంటి టాప్ ఓటీటీల్లో పెద్ద ఎత్తున ఒరిజినల్స్‌కు అలవాటు పడ్డారు. వాటికి వస్తున్న ఆదరణతో ఇండియాలో పెద్ద ఎత్తున కొత్త సిరీస్‌ల నిర్మాణం జరిగింది. ఇంతకుముందు చిన్న, మీడియం రేంజ్ నటీనటులే వీటిలో కనిపించేవారు కానీ.. క్రమంలో పెద్ద పెద్ద స్టార్లు సైతం వీటిలో అడుగు పెట్టేశారు.
బాలీవుడ్ స్టార్లు ఈ విషయంలో ముందంజలో ఉంటూ ట్రెండుకు తగ్గట్లు వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్ నుంచి వెంకటేష్, రానా, నాగచైతన్య డిజిటల్ డెబ్యూకు రెడీ అయిన సంగతి తెలిసిందే. అయితే టాప్ స్టార్ల ఎవరి నుంచీ ఇప్పటిదాకా డిజిటల్ డెబ్యూ దిశగా సంకేతాలు రాలేదు. మరి రాబోయే కొన్నేళ్లలో పరిస్థితులు మారతాయేమో తెలియదు.
మరి వెబ్ సిరీస్‌ల విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆలోచన ఎలా ఉంది.. ఆయనకు వాటిలో నటించడంపై ఆసక్తి ఉందా..? ఒక ప్రమోషనల్ ఈవెంట్‌కు హాజరైన మహేష్‌కు ఇవే ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికాయన ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతానికి వెబ్ సిరీస్‌ల్లో నటించే ఉద్దేశమేమీ లేదని.. కానీ తాను వాటికి అభిమానినని మహేష్ చెప్పాడు. తాను ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు బాగానే చూస్తానని చెప్పిన మహేష్.. తన ఫేవరెట్ ఒరిజినల్ సిరీస్ ఫ్రెండ్స్ అని తెలిపాడు.
నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే ఫ్రెండ్స్ సిరీస్‌ను మళ్లీ మళ్లీ చూస్తుంటానని.. అది తనకు స్ట్రెస్ బస్టర్ అని మహేష్ చెప్పడం విశేషం. ప్రస్తుతానికి వెబ్ సిరీస్‌ల్లో నటించకపోయినా.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనని అనడం ద్వారా తాను కూడా డిజిటల్ డెబ్యూ చేసే అవకాశాలు లేకపోలేదని సంకేతాలు ఇచ్చాడు సూపర్ స్టార్.