శిల్పా శెట్టి చెప్పకనే చెప్పేసిందా?


చాలా సాఫీగా సాగిపోతున్న బాలీవుడ్ భామ శిల్పా శెట్టి జీవితంలో ఈ ఏడాది భారీ కుదుపు ఎదురైంది. ఆమె భర్త రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలు నిర్మిస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొని అరెస్టవడంతో వారి కుటుంబం పరువు గంగ పాలైంది. ఇది శిల్పా మీద తీవ్ర ప్రభావమే చూపిందని స్పష్టమవుతోంది. ఈ కేసు విషయంలో భర్తను వెనకేసుకుని రాలేక.. మీడియాకు సమాధానం చెప్పలేక.. సొసైటీలో తలెత్తుకుని తిరగలేక ఆమె సతమతం అయిపోతోందని సన్నిహితులు అంటున్నారు.

కుంద్రా బాగోతం వల్ల శిల్పా చేస్తున్న షోలకు దూరం కావాల్సి వచ్చింది. అలాగే ఆమె చేతిలో ఉన్న కమర్షియల్ బ్రాండ్స్ పోయాయి. ఇంకా చాలా ఇబ్బందులే ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె రాజ్ కుంద్రా నుంచి విడిపోవాలనుకుంటున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

కుంద్రా ఇలాంటి పనులు చేస్తున్నట్లుగా తనకు తెలియదని.. తాను బిజీగా ఉన్న సమయంలో ఇవి జరిగాయని ఇటీవల శిల్పా మీడియాకు వెల్లడించడం తెలిసిందే. దీన్ని బట్టి ఆమె కుంద్రాను సమర్థించట్లేదన్నది స్పష్టమవుతోంది. అతడికి దూరంగా జరిగే ప్రయత్నమే చేస్తోందనిపిస్తోంది.

ఈ అభిప్రాయాలకు మరింత బలం చేకూరుస్తూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది శిల్పా. ఒక పుస్తకంలోని కోట్‌ను ఆమె ఇక్కడ ప్రస్తావించింది. “ఎవ్వరూ జీవితంలో వెనక్కి వెళ్లి కొత్త ప్రయాణాన్ని ఆరంభించలేరు. కానీ ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టి.. సరైన ముగింపును ఇవ్వవచ్చు”.. ఇదీ శిల్పా షేర్ చేసిన కోట్. ఇది కచ్చితంగా రాజ్ కుంద్రాతో తన బంధం గురించి చెబుతున్న మాటే అని.. అతడితో బంధాన్ని తెంచుకోబోతున్నట్లుగా ఆమె సంకేతాలు ఇస్తోందని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. మరి త్వరలోనే శిల్పా తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందేమో చూడాలి.