చరణ్ చితగ్గొట్టేశాడు


రామ్ చరణ్ కొత్తగా హాట్ స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సంగతి తెలిసిందే. చడీచప్పుడు లేకుండా ఈ డీల్ క్లోజ్ చేసిన హాట్ స్టార్ సంస్థ.. బ్యాంగ్ బ్యాంగ్ స్టయిల్లో చరణ్‌ను ప్రమోషన్ కోసం రంగంలోకి దించింది. ఒక ఆసక్తికర ప్రోమో రెడీ చేసి ‘స్టార్ మా’లో ప్రసారమయ్యే సూపర్ హిట్ షో ‘బిగ్ బాస్’లో దీన్ని లాంచ్ చేయించడమే కాక.. చరణ్‌ను ఆ షోలోకి దింపి సందడి చేయించింది. మామూలుగా వేదికల మీద మాట్లాడ్డానికి సిగ్గుపడే చరణ్.. ‘బిగ్ బాస్’ హౌస్‌లో చేసిన హంగామా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అవకాశం ఇస్తే ఒక రియాలిటీ షోను కూడా బ్రహ్మాండంగా నడిపించేస్తా అన్నట్లుగా స్టేజ్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తూ.. సమయోచితంగా పంచ్‌లు వేస్తూ.. చెప్పాలనుకున్న విషయాన్ని చాలా ఎపెక్టివ్‌గా చెబుతూ.. ఆద్యంతం ఈ షోలో ఆకట్టుకున్నాడు చరణ్. బిగ్ బాస్ కంటెస్టెంట్లతో మాట్లాడుతున్నపుడు ఒక్కొక్కరితో చాలా స్వీట్‌గా చరణ్ జరిపిన కాన్వర్జేషన్ మెప్పించింది. అన్నింటికీ మించి అతను ఈ షోలో చూపించిన అణకువ, హుందాతనం అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ షోలో బిగ్ బాస్, హాట్ స్టార్ విశేషాల గురించే కాక.. తాను చేస్తున్న సినిమాల గురించి కూడా సందర్భానుసారం మాట్లాడాడు. తన తండ్రి చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ కోసం పని చేయడం తన జీవిత కాల అనుభవం అని చరణ్ చెప్పాడు. రోజూ ఇంట్లో తండ్రితో గడిపినప్పటికీ.. సినిమా షూటింగ్‌లో ఆయనతో కలిసి పని చేయడం వేరే అనుభవం అని చరణ్ అన్నాడు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఏమైనా చెప్పాలని నాగార్జున అడిగితే.. అసలు ఆ సినిమాలో నటిస్తున్న తమకే రాజమౌళి అండ్ టీం ఏమీ చూపించట్లేదని చరణ్ తెలిపాడు. 10-15 రోజులు షూట్ చేసిన పాట ఎలా వచ్చిందో చూద్దామంటే రాజమౌళి కానీ.. కార్తికేయ, వల్లి గారు కానీ ఏమీ చూపించట్లేదని చరణ్ చెప్పాడు.

ఇక లాక్ డౌన్ టైంలో షూటింగ్‌లు లేనపుడు, వర్కవుట్ల విషయంలో ఉదాసీనంగా ఉండటంతో బాడీ కొంచెం షేపవుట్ అయిందని.. ఆ సమయంలో ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టడానికి నాగార్జున, చిరంజీవిలే ఆదర్శంగా నిలిచారని.. ఈ వయసులో వాళ్లిద్దరూ పడ్డ కష్టం చూసి ఎంతో ఇన్‌స్పైర్ అయ్యారని.. వాళ్లిద్దరినీ ట్రైన్ చేసింది ఒకే వ్యక్తి అని చరణ్ వెల్లడించాడు. ఇలా ఈ షోలో కనిపించిన 40 నిమిషాల పాటు చరణ్ ఆద్యంతం అలరించాడు.