ద‌మ్ము చూపిస్తున్న క‌మ్ముల‌

శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి గ‌ల్లీ రౌడీ సినిమా దిగింది. కానీ దాని కంటే కూడా వ‌చ్చే వారం రాబోతున్న ల‌వ్ స్టోరి సినిమాకు క‌నిపిస్తున్న బ‌జ్ ఎక్కువ‌గా ఉంది. ఆన్ లైన్ టికెట్ బుకింగ్స్ యాప్స్‌లో ఈ సినిమా దూకుడు చూసి అంద‌రూ షాకైపోతున్నారు. ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రేంజిలో దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ జ‌రుగుతున్నాయి.

విడుద‌ల‌కు ప‌ది రోజుల ముందే ల‌వ్ స్టోరికి బుకింగ్స్ మొద‌లు కావ‌డం విశేషం. ముందుగా ఈ చిత్ర నిర్మాత‌ల‌కు చెందిన ఏఎంబీ సినిమాస్‌లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇలా టికెట్లు పెట్ట‌డం ఆల‌స్యం అలా అమ్ముడైపోయి షోల‌కు షోలు సోల్డ్ ఔట్ అయిపోయాయి. త‌ర్వాత హైద‌రాబాద్‌లో ఒక్కొక్క‌టిగా థియేట‌ర్లు ల‌వ్ స్టోరి టికెట్ల‌ను తెరిచాయి. రెస్పాన్స్ అదిరిపోయింది.

ల‌వ్ స్టోరికి అతి పెద్ద ఆక‌ర్ష‌ణ శేఖ‌ర్ క‌మ్ముల‌నే అన‌డంలో సందేహం లేదు. చివ‌ర‌గా అత‌ను తీసిన ఫిదా ఎంత పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిందో తెలిసిందే. మ‌రోసారి ఇంకో స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌తో శేఖర్ ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించాడు. ఈ సినిమా ప్ర‌తి ప్రోమో కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. సినిమా మీద ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పెంచింది.

నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జోడీ కూడా సినిమాకు మ‌రింత ఆక‌ర్ష‌ణ తీసుకొచ్చింది. క‌రోనా సెకండ్ వేవ్ బ్రేక్ త‌ర్వాత క్రేజున్న సినిమాలు రిలీజ్ కాక ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డానికి అనాస‌క్తితో ఉన్నారు. మ‌ళ్లీ బిగ్ స్క్రీన్ల‌కు రావ‌డానికి స‌రైన సినిమా కోసం చూస్తున్నారు.

అలాంటి సినిమానే ల‌వ్ స్టోరి కావ‌డంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జ‌రుగుతున్నాయి. ఈ జోరు చూస్తుంటే మీడియం రేంజ్ సినిమాల్లో ఇది వ‌సూళ్ల ప‌రంగా కొత్త రికార్డులు న‌మోదు చేసేలా ఉంది.