గ‌ల్లీ రౌడీలో కోన అలా ఎందుకు వేశాడంటే..?


ఈ శుక్ర‌వారం మంచి అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది సందీప్ కిష‌న్ కొత్త చిత్రం గ‌ల్లీ రౌడీ. కామెడీ చిత్రాల ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ నిర్మించారు. ఈ చిత్రానికి కోన వెంక‌ట్ స‌మ‌ర్పకుడ‌న్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌కు ఈ సినిమా ర‌చ‌న‌లో భాగ‌స్వామ్యం లేదు. అయినా స‌రే.. పోస్ట‌ర్ మీద ఫ్ర‌మ్ ద రైట‌ర్ ఆఫ్ ఢీ, రెడీ, దూకుడు అని వేసుకోవ‌డం చాలామందిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ఆ సినిమా రైట‌ర్ నుంచి వ‌స్తున్న సినిమా అంటే.. ఈ చిత్రానికి కూడా ఆయ‌నే ర‌చ‌యిత అనుకోవ‌డం స‌హ‌జం. మ‌రి రైటింగ్‌లో త‌న భాగ‌స్వామ్యం లేక‌పోయినా కోన ఇలా ఎందుకు వేసుకున్న‌ట్లు అన్న సందేహం క‌లుగుతోంది.

గ‌ల్లీ రౌడీ ప్రి రిలీజ్ ఈవెంట్లో దీనికి స‌మాధానం చెప్పాడు కోన‌. ఈ సినిమాకు క‌థ అందించింది భాను అయితే.. సినిమా తీసింది నాగేశ్వ‌ర‌రెడ్డి అని.. తాను ఈ చిత్రానికి ర‌చ‌యిత‌ను కానని.. ఐతే పోస్ట‌ర్లో ఫ్ర‌మ్ ద రైట‌ర్ ఆఫ్ ఢీ, రెడీ, దూకుడు అని వేయ‌డానికి కార‌ణం.. ఈ సినిమా కూడా ఆ చిత్రాల త‌ర‌హాలోనే ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్టైన‌ర్ కావ‌డ‌మే అని కోన వెల్ల‌డించాడు.

ఇక తాను ఏ హీరోతో తొలిసారి ప‌ని చేసినా ఆ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుంద‌న్న సెంటిమెంటు ఉంద‌ని.. ఢీ సినిమా విష్ణుకు బ్లాక్‌బ‌స్ట‌ర్ అయితే.. రామ్‌తో తొలిసారి చేసిన రెడీ కూడా ఘ‌న‌విజ‌యం సాధించింద‌ని.. ఎన్టీఆర్‌తో చేసిన తొలి సినిమా అదుర్స్.. మ‌హేష్ బాబుతో చేసిన తొలి చిత్రం దూకుడు కూడా భారీ విజ‌యాల‌ను అందుకున్నాయ‌ని.. ఇప్పుడు సందీప్ కిష‌న్‌తో తాను చేసిన తొలి సినిమా గ‌ల్లీ రౌడీ కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డం గ్యారెంటీ అని కోన ధీమా వ్య‌క్తం చేశాడు.