మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ‘మా బిడ్డలు’ పేరుతో ప్యానెల్ పెట్టి అధ్యక్షుడిగా బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్ చాలా దూకుడుగా ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నారు. ‘మా’ సభ్యులను ఎంగేజ్ చేస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా ఆయన తన ప్యానెల్ సభ్యులు, మద్దతుదారులతో ఒక ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అందులో ఒక సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ‘మా’ సభ్యుల సంఖ్య గురించి ఆయన చేసిన విశ్లేషణ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రకాష్ రాజ్ ఎంతో హోం వర్క్ చేశాక ‘మా’ ఎన్నికల బరిలో నిలిచారని అర్థమైంది. ‘మా’లో 900 మంది సభ్యులున్నారని అందరూ అంటున్నారని.. కానీ ఎన్నికలకు వచ్చేసరికి 900 మంది అనేది పేరుకే అంటూ ఆయన చేసిన విశ్లేషణ ఏంటో చూద్దాం పదండి.
“మా అసోసియేషన్‌లో 900మంది సభ్యులున్నారని అందరూ అంటున్నారు. అందులో సుమారు 150మంది యాక్టివ్ మెంబర్స్ కాదు. జెనీలియా కూడా ‘మా’లో సభ్యురాలే. కానీ ఆమె మాజీ ముఖ్యమంత్రి కొడుకును వివాహం చేసుకుని ముంబయికి వెళ్లిపోయింది. ఆమె యాక్టివ్ మెంబర్కారు. అలాంటి వాళ్లను తీసేస్తే 750మంది మాత్రమే ఉన్నాం. అందులో 147 మంది స్థానికులు కాదు. చెన్నై, బెంగళూరు, కేరళ నుంచి వచ్చి తమ షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిపోతారు. వాళ్లకు పారితోషకం, బస, ఫ్లైట్ టికెట్స్‌కు డబ్బులు కూడా బాగానే ఇస్తారు. ఇక ఉన్నది 600 మంది మాత్రమే. అందులో కొందరు యువ కథానాయకులు, పెద్ద పెద్ద నటులు ఓటు వేయడానికి రారు. వాళ్లకు అవసరం లేదు. మిగిలింది 450 మంది. అందులో కూడా 200 మంది బాగానే ఉన్నారు. ఇక ‘మా’లో ఆదుకోవాల్సింది 250 మందిని మాత్రమే. ఆదుకోలేమా?” అని ప్రకాష్ రాజ్ అన్నారు.
‘మా’లో 40 మంది రంగస్థల కళాకారులున్నారని.. వాళ్లకు కొంచెం కౌన్సెలింగ్ ఇస్తే సినిమా కెమెరాకు అనుగుణంగా నటిస్తారని.. ఈ కళాకారులకు ప్రభుత్వ పథకాలున్నాయి కదా అని తాను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను అడిగితే ‘మమ్మల్ని ఎవరూ అడగలేదు కదా’ అని బదులిచ్చారని.. మంచి చేయాలనుకున్నారు ఎలా చేయాలో, ఎవరికి చేయాలో తెలియని పరిస్థితి నెలకొందని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. తాను ఆరు నెలల పాటు హోం వర్క్ చేసి ‘మా’ ఎన్నికల బరిలో నిలిచినట్లు ఆయన వెల్లడించారు.