టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అండతో ఇండస్ట్రీలోకి హీరోగా అరంగేట్రం చేశాడు అతడి తమ్ముడు సాయిరాం శంకర్. తన అన్న దర్శకత్వంలోనే 143 అనే సినిమాతో అతను ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. తర్వాత నటించిన కొన్ని సినిమాలు కూడా నిరాశనే మిగిల్చాయి. ఐతే పూరి కథతో చేసిన బంపర్ ఆఫర్ మాత్రం మంచి ఫలితాన్నందించింది. కానీ ఆ విజయాన్ని అతను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. తర్వాత చాలా సినిమాల్లో నటించాడు కానీ.. ఒక్కటీ ఆడలేదు. గత కొన్నేళ్ల నుంచి సాయిరాం పేరే ఇండస్ట్రీలో వినిపించట్లేదు. దాదాపుగా అతడి కెరీర్ ముగిసినట్లే కనిపించింది.
ఐతే సోమవారం సాయిరాం శంకర్ పుట్టిన రోజు సందర్భంగా అతడికి శుభాకాంక్షలు చెబుతూ రెండు సినిమాల విశేషాలను పంచుకున్నారు. అందులో ఒకటి.. రీసౌండ్. ఇది మామూలు సినిమాలాగే కనిపిస్తోంది.
ఐతే సాయిరాం నటించిన ఇంకో సినిమా మాత్రం ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లో సాయిరాం శంకర్ ఒక యోగి అవతారంలో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ గమనిస్తే ఇదొక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన భారీ చిత్రంలా కనిపిస్తోంది. మలయాళంలో మంచి పేరున్న వినోద్ విజయన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడం విశేషం. అతను నిర్మాతల్లో ఒకడు కూడా.
రాజీవ్ రవి లాంటి ప్రముఖ కెమెరామన్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందించగా.. ఓ మై ఫ్రెండ్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు రాహుల్ రాజ్ సంగీతం అందించాడు. మరో పేరున్న మ్యూజిక్ కంపోజర్ గోపీ సుందర్ నేపథ్య సంగీతం సమకూర్చాడు. మొత్తంగా చూస్తే ఇది పెద్ద స్థాయి సినిమాలాగే కనిపిస్తోంది. ఇలాంటి సినిమాలో సాయిరాం లీడ్ రోల్ చేయడం, చడీచప్పుడు లేకుండా సినిమా పూర్తయిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates