జ‌గ‌న్‌తో చిరు మీటింగ్ డేట్ ఫిక్స్?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్ర‌తినిధుల బృందం స‌మావేశం కాబోతోంద‌ని నెలా నెల‌న్న‌ర కింద‌టే వార్త‌లొచ్చాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టికెట్ల ధ‌ర‌ల‌తో పాటు వివిధ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు ఉద్దేశించిన ఈ మీటింగ్‌కు ఆహ్వానిస్తూ మంత్రి పేర్ని నాని.. చిరు బృందాన్ని క‌ల‌వ‌డం.. ఆ త‌ర్వాత ఈ మీటింగ్‌లో ఏం మాట్లాడాల‌న్న‌దానిపై మెగాస్టార్ సినీ పెద్ద‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించ‌డం తెలిసిందే.

ఐతే ఇదిగో అదిగో అంటున్నారే త‌ప్ప ఆ స‌మావేశం మాత్రం ఎంత‌కీ జ‌ర‌గ‌ట్లేదు. సీఎం జ‌గ‌న్ సిమ్లా ప‌ర్య‌ట‌న అనంత‌రం మీటింగ్ అన్నారు కానీ.. ఆ త‌ర్వాత కూడా చ‌ప్పుడు లేదు. దీంతో అస‌లీ మీటింగ్ ఉంటుందా లేదా అన్న సందేహాలు మొద‌ల‌య్యాయి. ఐతే ఎట్ట‌కేల‌కు ఈ స‌మావేశానికి ముహూర్తం కుదిరిన‌ట్లు స‌మాచారం.

ఈ నెల 20వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ను మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని చిత్రపరిశ్రమ బృందం కలవనున్నట్లు స‌మాచారం. జ‌గ‌న్‌తో అపాయింట్మెంట్‌ను ఖ‌రారు చేస్తూ మంత్రి పేర్ని నాని నుంచి చిరు బృందానికి స‌మాచారం అందిన‌ట్లు తెలిసింది. ఈ సమావేశంలో హీరో నాగార్జున, నిర్మాతలు దిల్‌ రాజు, దగ్గుబాటి సురేశ్‌బాబు తదితరులు పాల్గొనున్నారట‌.

వ‌కీల్ సాబ్ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా టికెట్ల రేట్ల‌పై నియంత్ర‌ణ తీసుకురావ‌డం టాలీవుడ్‌కు తీవ్ర ఇబ్బందిక‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మ‌స్య‌తో పాటు కొత్త సినిమాలకు బెనిఫిట్‌ షోలకు అవకాశం ఇవ్వాలని.. క‌రోనా ష‌ర‌తులు తొల‌గించి నగరాలు, పట్టణాల్లో రోజుకు నాలుగు షోలు ప్రదర్శించే వెసులుబాటు కల్పించాలని ఈ స‌మావేశంలో జ‌గ‌న్‌కు చిరు బృందం విన్న‌వించ‌నుంది. అలాగే ప్ర‌భుత్వం కొత్త‌గా ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ టికెట్ల విక్రయానికి సంబంధించిన యాప్ గురించి కూడా ఈ స‌మావేశంలో చ‌ర్చించే అవ‌కాశ‌ముంది.