రొటీన్ మాస్ మసాలా, ఫార్ములా సినిమాలు చేయడానికి టాలీవుడ్లో చాలామంది హీరోలున్నారు. ముఖ్యంగా వారసత్వంతో వచ్చి స్టార్లు అయిన చాలామంది హీరోలకు మాస్ సినిమాలే ఆధారం. వాళ్లకు ఆ సినిమాలతోనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు ప్రయోగాలు చేసినా, కొత్తగా ఏదైనా ట్రై చేసినా రిస్క్ ఎక్కువ ఉంటుంది.
అదే సమయంలో కొందరు హీరోలు కొత్తగా ఏదో ఒకటి ట్రై చేస్తేనే బాగుంటుంది. ముందు నుంచి వాళ్లు భిన్నమైన సినిమాలే చేయడం వల్ల ప్రేక్షకులు అలాంటివే ఆశిస్తారు. అలాంటి హీరోలు రొటీన్ బాట పడితే ప్రేక్షకులకు రుచించదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి కష్టపడి స్టార్‌గా ఎదిగిన నాని ఈ కోవకే చెందుతాడు. నాని సినిమా అంటే ఎంతో కొంత కొత్తదనం ఉంటుందని.. అతను మూస సినిమాలు చేయడని బలమైన అభిప్రాయం జనాల్లో ఉంది.
కానీ గత కొన్నేళ్ల నుంచి మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించే క్రమంలో నాని తన పేరును చెడగొట్టుకుంటున్నాడు. కొన్నేళ్ల ముందు ఎంసీఏ అనే రొటీన్ సినిమా చేశాడు నాని. అప్పుడు అతనున్న ఊపులో రొటీన్ అయినప్పటికీ ఆ సినిమా బాగా ఆడేసింది. కొన్ని ఆకర్షణలు ఆ సినిమాకు కలిసొచ్చాయి. కానీ గత ఏడాది వచ్చిన వి మూవీ చూసినా.. ఇప్పుడు రిలీజైన టక్ జగదీష్ చూసినా.. నాని ఇలాంటి సినిమాలు ఎలా ఒప్పుకున్నాడు.. అతడికి ఇలాంటి సినిమాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఈ చిత్రాలను రూపొందించింది మోహనకృష్ణ ఇంద్రగంటి, శివ నిర్వాణ లాంటి మంచి అభిరుచి ఉన్న దర్శకులు కావడం ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం. నాని రీచ్ పెంచుకోవడానికి ఇలాంటివి ట్రై చేస్తుండొచ్చు కానీ.. నాని సినిమాలంటే కొత్తగా ఉంటాయని అతడికి అభిమానులుగా మారిన వాళ్లు అతడికి దూరమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇకనుంచైనా నాని ఇలాంటి సినిమాలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే మంచిది.