విజయ్ దేవరకొండ సినిమాపై ‘టక్ జగదీష్’ ఎఫెక్ట్!

టాలీవుడ్ లో ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ లాంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ. రీసెంట్ గా నానితో ‘టక్ జగదీష్’ సినిమా చేశాడు. ఆయన డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు భారీ విజయాలను అందుకోవడంతో ‘టక్ జగదీష్’పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకి బజ్ ఓ రేంజ్ లో వచ్చింది. అందుకే విజయ్ దేవరకొండ కూడా శివ నిర్వాణతో ఓ సినిమా చేయడానికి ఉత్సాహం చూపించాడు. వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి.

అయితే ఈ ప్రాజెక్ట్ చేయాలా ..? వద్దా..? అనే విషయంలో విజయ్ దేవరకొండ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పాన్ ఇండియా కథలే చేయాలనుకుంటున్న విజయ్ దేవరకొండ.. శివ నిర్వాణ చెప్పిన లవ్స్టోరీ కి కనెక్ట్ అవ్వలేకపోయాడని టాక్ వచ్చింది. అయితే ఈ విషయంపై శివ నిర్వాణ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తన తదుపరి సినిమా విజయ్ దేవరకొండతోనే చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

నిజానికి ‘టక్ జగదీష్’ సినిమా రిజల్ట్ బాగా వచ్చి ఉంటే.. శివ నిర్వాణ-విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ పై ఎలాంటి అనుమానాలు వచ్చి ఉండేవి కావు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ‘టక్ జగదీష్’ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఓటీటీలో రిలీజ్ అయింది కాబట్టి సరిపోయింది కానీ థియేటర్లో వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ.. శివ నిర్వాణతో సినిమా చేయడం కష్టమనిపిస్తుంది. మొన్నటివరకు డైలమాలో ఉన్న విజయ్ కి ఇప్పుడొక క్లారిటీ వచ్చి ఉంటుంది. విజయ్ హ్యాండిస్తే మాత్రం శివ నిర్వాణ మరో హీరోని వెతుక్కోవాల్సి ఉంటుంది.