రజినీ అభిమానుల్లో సౌండ్ లేదు

ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ఒకటి మొదలైందంటే.. అభిమానుల్లో ఉండే ఉత్సాహమే వేరుగా ఉండేది. ఆయన సినిమా ఫస్ట్ లుక్, టీజర్ లాంటివి రిలీజైతే సోషల్ మీడియా హోరెత్తిపోయేది. రజినీ మాస్ అవతారం ఎత్తాడంటే వాళ్లకు గూస్ బంప్స్ వచ్చేసేవి. కానీ గత కొన్నేళ్లలో కథ పూర్తిగా మారిపోయింది. వరుస ఫ్లాపులతో సూపర్ స్టార్ తన ప్రభను కోల్పోయాడు. ఇంతకుముందులా రజినీని చూసి జనాలు ఊగిపోవట్లేదు. పెద్దగా విషయం లేని.. ఒకే టైపు సినిమాలు చేయడం ఆయనకు ప్రతికూలంగా మారింది.

చివరగా రజినీ నుంచి వచ్చిన దర్బార్, పేట సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇప్పుడు ‘శౌర్యం’ శివ దర్శకత్వంలో రజినీ చేసిన ‘అన్నాత్తె’ కూడా ప్రేక్షకులకు ఏమంత ఎగ్జైట్మెంట్ ఇస్తున్నట్లుగా కనిపించడం లేదు. వినాయక చవితి కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అది చూస్తే పరమ రొటీన్‌గా అనిపించింది.

రెండేళ్ల ముందు వచ్చిన ‘పేట’ సినిమా లుక్‌కు, అన్నాత్తె లుక్‌కు పెద్దగా తేడా లేమీ లేదు. పోస్టర్లో ఇంకే రకమైన కొత్తదనం కూడా కనిపించలేదు. తాజాగా బుల్లెట్ మీద వెళ్తూ కత్తి పట్టుకున్న లుక్ ఒకటి రిలీజ్ చేశారు. అది కూడా మామూలుగానే ఉంది. ఇవి చూసిన వాళ్లంతా ఏముంది రజినీ ఎప్పట్లాగే రొటీన్ మాస్ మసాలా మూవీ ఏదో చేస్తున్నాడు అంటూ పెదవి విరుస్తున్నారు. ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసేలా ఈ సినిమా ఉండదని ఒక అంచనాకు వచ్చేస్తున్నారు. ఐతే ఈ పోస్టర్లు చూసి కొందరేమో మరోలా స్పందిస్తున్నారు.

‘కబాలి’ సినిమాలో ఏదో ఉంటుందని భ్రమలు కల్పించేలా పోస్టర్లు వదిలి.. చివరికి తీవ్ర నిరాశకు గురి చేసినట్లు కాకుండా.. ఇలా అంచనాలు తగ్గించేలా.. ప్రేక్షకులు మరీ ఎక్కువ ఆశించకుండా చూడటం మంచిదే అని.. ఇలా తక్కువ అంచనాలతో థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు ఓ మోస్తరు వినోదం అందించినా చాలని.. శివ సినిమా అంటే ఆమాత్రం మినిమం గ్యారెంటీ ఉంటుందని.. కాబట్టి రజినీ అభిమానులు వర్రీ కావాల్సిన పని లేదని అంటున్నారు.