‘మా’ భవనం అసలెందుకు అమ్మేశారు?


మూవీ ఆర్టిస్ట్ట్ అసోసియేషన్ (మా)కు సొంత భవనం లేకపోవడం మీద ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. మహా మహులు ఉన్న ఈ సంఘం కనీసం సొంతంగా ఒక భవనం కట్టుకోకపోవడమో.. లేదా కొనుక్కోకపోవడమో ఎందుకు చేయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐతే నిజానికి ‘మా’కు ఎప్పుడూ భవనం లేకుండా ఏమీ లేదు. గతంలో ‘మా’కు ఒక సొంత భవనం కాదు కానీ.. ఒక ఫ్లాట్ ఉండేది. అదొక పెంట్ హౌస్. రూ.70 లక్షలకు పైగా ఖర్చు చేసి ఆ ఇంటిని కొన్నారట.

ఐతే తర్వాత దాన్ని తక్కువ ధరకు అమ్మేయడం వివాదాస్పదం అయింది. దీని గురించి ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో సీనియర్ నటుడు మోహన్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. ఎక్కువ మొత్తానికి బిల్డింగ్ కొని.. తర్వాత దాన్ని తక్కువ ధరకు అమ్మేయడం ఏంటంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీని మీద మరింతగా వివాదం రాజుకోవడం.. టీవీ చర్చల్లో దీని గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడుతుండటంతో.. ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా లైన్లోకి వచ్చారు. శివాజీ రాజా కార్యదర్శిగా ఉన్నపుడే బిల్డింగ్ అమ్మేయడం జరిగిందని ఒకప్పటి ‘మా’ అధ్యక్షుడు నాగబాబు పేర్కొనడంతో శివాజీ రాజా దీనిపై వివరణ ఇచ్చారు. రూ.70 లక్షలకు పైగా ఖర్చు చేసి ‘మా’ కోసం బిల్డింగ్ తీసుకోవడం వాస్తవమే అని.. తర్వాత దాని మరమ్మతులకు కొన్ని లక్షలు ఖర్చయ్యాయని.. కానీ ఆ తర్వాత ఆ భవనంతో సమస్యలు తలెత్తాయని శివాజీ రాజా చెప్పాడు.

ఆ భవనం ప్రైమ్ ఏరియాలో లేదని.. కింద మురుగు కాలువ ఉండటం సమస్యగా మారిందని.. ఖాళీగా ఉన్నపుడు రెంట్‌కు ఇస్తే సరైన ఆదాయం కూడా రాలేదని.. దీని వల్ల పెద్దగా ప్రయోజనం లేదని భావించి మురళీ మోహన్ సహా ‘మా’లోని కీలక వ్యక్తుల సలహా తీసుకుని తక్కువ రేటుకు అమ్మేసిన మాట వాస్తవమే అని.. ఐతే అప్పుడు ఈ నిర్ణయాన్ని అభినందించారని.. దీని మీద ఇప్పుడు వివాదం చేయడం తగదని శివాజీ రాజా పేర్కొన్నారు.