ఆ హీరో సినిమాలు నెల‌లో నాలుగు రిలీజ్‌


ఒక హీరో సినిమాలు నెల రోజుల వ్య‌వ‌ధిలో రెండు రిలీజైతే మ‌రీ ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌ని లేదు. కొన్నిసార్లు అనుకోని ప‌రిస్థితుల్లో త‌క్కువ వ్య‌వ‌ధిలో ఒక హీరో సినిమాలు రెండు రిలీజైన సంద‌ర్భాలున్నాయి. నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలు బంగారు బుల్లోడు, నిప్పుర‌వ్వ‌.. నాని చిత్రాలు ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం, జెండాపై క‌పిరాజు ఒకే రోజు విడుద‌ల కావ‌డం తెలిసిందే. ఐతే ఇప్పుడు ఓ పేరున్న హీరో న‌టించిన నాలుగు సినిమాలు నెల రోజుల వ్య‌వ‌ధిలో విడుద‌ల కాబోతుండ‌టం విశేషం. అందులో మూడు చిత్రాలు ఒక వారం వ్య‌వ‌ధిలోనే రిలీజ్ కానుండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ న‌టుడే విజ‌య్ సేతుప‌తి.

హీరో, విల‌న్, క్యారెక్ట‌ర్ రోల్.. ఇలా ఏ పాత్ర అయినా స‌రే త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకునేలా ఉంటే విజ‌య్ సేతుప‌తి ఓకే చెప్పేస్తాడు. గ్యాప్ లేకుండా సినిమాలు చేసేస్తుంటాడు. గ‌త ఏడాదిలో అత‌ను దాదాపు అర‌డ‌జ‌ను సినిమాల్లో న‌టించాడు. అందులో హీరోగా న‌టించిన మూడు చిత్రాలు వారం వ్య‌వ‌ధిలో విడుద‌ల కానున్నాయి. సేతుప‌తి, జ‌గ‌ప‌తిబాబు, శ్రుతి హాస‌న్ కీల‌క పాత్ర‌లు పోషించిన‌ లాభం అనే సినిమా ఈ నెల 9న త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఇక మ‌రుస‌టి రోజు స‌న్ టీవీలో నేరుగా తుగ్ల‌క్ ద‌ర్బార్ అనే విజ‌య్ సినిమా రిలీజ్ కాబోతోంది. త‌ర్వాతి రోజు ఆ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లోకి వ‌స్తుంది. ఇందులో రాశి ఖ‌న్నా క‌థానాయిక‌.

ఇక ఈ నెల‌ 17న విజ‌య్ సేతుప‌తి-తాప్సిల అన‌బెల్ సేతుప‌తి హాట్ స్టార్ ద్వారా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. అది త‌మిళం, తెలుగు, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజవుతోంది. ఇవి కాక సేతుప‌తి ఓ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించిన‌ క‌డైసి వివ‌సాయి అనే సినిమా కూడా ఈ నెల‌లోనే రిలీజ్ కానుంది. ముందు సోనీ లివ్ ద్వారా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ ఇప్పుడు ఆలోచ‌న మార్చుకుని ఈ నెల చివ‌ర్లో థియేట‌ర్ల‌లోనే ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇలా అటు ఇటుగా మూడు వారాల వ్య‌వ‌ధిలో సేతుప‌తి సినిమాలు నాలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.