కరోనా మహమ్మారి ధాటికి థియేటర్ల వ్యవస్థ దారుణంగా దెబ్బ తిన్న టైంలో మంచి క్రేజున్న సినిమాలకు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీల్లో రిలీజ్ చేస్తుండటం పట్ల ఎగ్జిబిటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై టాలీవుడ్లో కొన్ని రోజులుగా పెద్ద వివాదమే నడుస్తోంది. నాని చిత్రం టక్ జగదీష్‌ను ఓటీటీ బాట పట్టించడంపై ఎగ్జిబిటర్లు ఓ ప్రెస్ మీట్లో తీవ్ర స్థాయిలో విమర్శలు, హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ఇటీవల నాని ఆవేదన వ్యక్తం చేయడమూ విదితమే.
థియేటర్లు చాలా కాలం మూతపడి ఉండటం, ఇంకా జనాలు మునుపటి స్థాయిలో థియేటర్లకు రాకపోవడం, ఏపీలో టికెట్ల రేట్ల గొడవ లాంటి కారణాలతో తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఓటీటీ బాట పడుతున్నామని నిర్మాతలు అంటున్నారు. వారికి మద్దతుగా ఆర్టిస్టులు కూడా గళం విప్పుతున్నారు.
ఇలాంటి టైంలో గోపీచంద్ నటించిన సీటీమార్ లాంటి క్రేజీ మూవీ.. టక్ జగదీష్ ఓటీటీలో వస్తున్న సమయంలోనే థియేటర్లలో రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో గోపీచంద్ తన సినిమా ప్రమోషన్ కోసం మీడియాను కలవడంతో థియేటర్స్ వెర్సస్ ఓటీటీల వివాదంపై అతడికి ప్రశ్నలు ఎదురయ్యాయి.
గోపీచంద్ దీనికి బదులిస్తూ.. ‘‘ప్రతి నిర్మాతా తన చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకుంటాడు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నిర్మాతలకు ఇబ్బందులు తప్పవు. వాళ్లు ఫైనాన్స్ తీసుకొచ్చి సినిమాలు తీస్తారు. ఆరేడు నెలల్లో రిలీజ్ చేయాలనుకుంటారు. ఆలస్యమయ్యే కొద్దీ వడ్డీల భారం పెరుగుతుంది. కాబట్టి వాళ్ల పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఓటీటీల్లో రిలీజవుతున్న సినిమాల గురించి నేను కామెంట్ చేయను. వాళ్ల స్థానంలో కూర్చుని ఆలోచిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఓటీటీలు మంచి ఫ్లాట్‌ఫామే. భవిష్యత్తులో వాటికి మరింతగా ఆదరణ ఉంటుంది. కానీ థియేటర్లు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఓటీటీ అడిషనల్ అడ్వాంటేజ్’’ అని చెప్పాడు.