కరోనా మహమ్మారి ప్రభావం మొదలైనప్పటి నుంచి హిందీ చిత్రాల పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో తెలిసిందే. ఏడాదిన్నరగా కరోనా దెబ్బకు బాలీవుడ్ అల్లాడిపోతోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత మిగతా భాషల్లో సినిమాలు బాగానే విడుదలవుతున్నాయి. ఉన్నంతలో మంచి ఫలితాలే వస్తున్నాయి.
కానీ హిందీ చిత్రాల పరిస్థితి మాత్రం దారుణం. ఫస్ట్ వేవ్ తర్వాత చాలా వరకు చిన్న, మీడియం రేంజ్ సినిమాలే రిలీజయ్యాయి. వాటిని అస్సలు పట్టించుకోలేదు హిందీ ప్రేక్షకులు. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలన్న ఉత్సాహమే వారిలో కనిపించలేదు. కనీసం సెకండ్ వేవ్ తర్వాత అయినా పరిస్థితి మారుతుందనుకుంటే అలాంటి సంకేతాలేమీ కనిపించలేదు.
ఈసారి అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరో నటించిన బెల్ బాటమ్ చిత్రాన్ని ఎన్నో ఆశలతో రిలీజ్ చేస్తే దానికి బాక్సాఫీస్ దగ్గర పరాభవం తప్పలేదు. బాలీవుడ్ ఆశించిన రివైవల్ కనిపించలేదు. అమితాబ్ బచ్చన్ మూవీ చెహ్రె పరిస్థితీ ఇంతే. ఐతే హిందీ సినిమాలు ఏ స్థాయివి రిలీజ్ చేసినా పట్టించుకోని ప్రేక్షకులు.. ఇంగ్లిష్ చిత్రాలకు మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ మధ్యే రిలీజైన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-9.. అలాగే షాంగ్ చి అండ్ ద లెజెండ్ ఆఫ్ ద టెన్ రింగ్స్ సినిమాలకు దేశవ్యాప్తంగా చాలా మంచి వసూళ్లు వస్తున్నాయి. బెల్ బాటమ్‌తో పోలిస్తే వీటికి రోజువారీ వసూళ్లు రెండు మూడు రెట్లు వస్తున్నాయి. ఈ చిత్రాలను చూడ్డానికి హిందీ ప్రేక్షకులు పెద్ద ఎత్తునే థియేటర్లకు వస్తున్నారు. వీకెండ్లోనే కాక వీక్ డేస్‌లోనూ ఈ చిత్రాల థియేటర్లు ఆడియన్స్‌తో కళకళలాడుతున్నాయి. మరి హాలీవుడ్ సినిమాల మీద ఉన్న ఆసక్తి బాలీవుడ్ మూవీస్ మీద నార్త్ ఆడియన్స్ ఎందుకు చూపించడం లేదన్నది ప్రశ్న.