హారర్ వెబ్ సిరీస్ లో నాగచైతన్య!

Naga Chaitanya

ఒకప్పుడు వెండితెరపై మాత్రమే కనిపించే మన సినీ తారలు.. ఇప్పుడు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కరోనా కారణంగా ఎన్ని ఇండస్ట్రీలు కుదేలైనా.. ఓటీటీ మాత్రం పుంజుకుంది. థియేటర్లలో సినిమాలు చూడలేని పరిస్థితుల్లో ఓటీటీ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచింది. సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు తెరుచుకున్నప్పటికీ.. థియేటర్లలో సినిమాలు విడుదల చేయడానికి రిస్క్ చేయలేని దర్శకనిర్మాతలు ఓటీటీల్లో తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.

దీంతో సినిమా జనాలు ఓటీటీలను సీరియస్ గా తీసుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అమెజాన్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’లో నటించి.. అందరినీ మెప్పించింది. ఒక స్టార్ హీరోయిన్ వెబ్ సిరీస్ కు వెళ్లడమంటే సమంతతోనే మొదలైంది. ఇప్పుడు ఆమె భర్త నాగచైతన్య వంతు వచ్చింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య ఓ వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ కోసం చేయబోతున్నారు.

ఒక్కో ఎపిసోడ్ నలభై నిముషాలు ఉంటుందట. మొత్తం ఎనిమిది ఎపిసోడ్ లుగా సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇక్కడ మరో విషయమేమిటంటే.. హారర్ జోనర్ కి ఆమడదూరంలో ఉండే చైతన్య ఇప్పుడు అదే జోనర్ లో వెబ్ సిరీస్ చేస్తున్నారు. విక్రమ్ కె కుమార్ తన కెరీర్ ఆరంభంలో ’13బి’ అనే హారర్ సినిమా రూపొందించారు. మళ్లీ ఇప్పుడు అదే జోనర్ ను టచ్ చేయబోతున్నారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో ‘థాంక్యూ’ అనే సినిమా తెరకెక్కుతోంది. అది పూర్తికాగానే వెబ్ సిరీస్ ను మొదలుపెట్టబోతున్నారు. ఈ సిరీస్ ను శరత్ మరార్ నిర్మించబోతున్నారు.