ఇక మాస్ సినిమాల జాతర


తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పున:ప్రారంభమై నెల దాటింది. కానీ బాక్సాఫీస్‌ దగ్గర ఆశించిన ఊపు మాత్రం కనిపించడం లేదు. ఇందుక్కారణం ఇప్పటిదాకా రిలీజైనవి చాలా వరకు చిన్న స్థాయి, క్లాస్ టచ్ ఉన్న సినిమాలే. ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించే మాస్ సినిమాలు, పెద్ద స్థాయి చిత్రాలు ఇంకా రాకపోవడం ప్రతికూలమైంది.

ఈ వారం వచ్చిన నూటొక్క జిల్లాల అందగాడు, డియర్ మేఘా చిత్రాల పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. ఐతే వచ్చే వారం నుంచి పరిస్థితి మారబోతోంది. థియేటర్లలో సినిమాలు చూడ్డానికి ఇష్టపడే ప్రేక్షకులు ఎలాంటి చిత్రం కోరుకుంటారో అలాంటిదే వచ్చే వారం బాక్సాఫీస్ బరిలోకి దిగబోతోంది.

యాక్షన్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో సంపత్ నంది రూపొందించిన ‘సీటీమార్’ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 10న థియేటర్లలోకి దిగబోతోంది. ఈ వారమే ఆ సినిమా రావాల్సింది కానీ.. కొన్ని కారణాల వల్ల వారం వాయిదా వేశారు. శనివారం ఈ చిత్రానికి సెన్సార్ పూర్తయింది. గ్రాండ్ రిలీజ్‌కు రంగం సిద్ధమైనట్లే. ప్రస్తుతం థియేటర్లు పెద్ద ఎత్తున అందుబాటులో ఉండగా.. వాటిలో ఆడటానికే సరైన సినిమాలు లేవు. ‘సీటీమార్’ పెద్ద స్థాయి సినిమా కావడంతో భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ట్రేడ్ ఈ చిత్రంపై భారీ అంచనాలతోనే ఉంది.

ఈ సినిమాతో పాటు కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన జయలలిత బయోపిక్ ‘తలైవి’ కూడా వచ్చే వారమే విడుదల కానుంది. ఇక తర్వాతి వారం మరో మాస్ సినిమా థియేటర్లలో దిగుతోంది. అదే.. గల్లీ రౌడీ. సెప్టెంబరు 3న రిలీజ్ అనుకుని.. తర్వాత వాయిదా పడ్డ ఈ చిత్రం సెప్టెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తాజాగా ప్రకటించారు. ఆ తర్వాత ఎలాగూ లవ్ స్టోరి, రిపబ్లిక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి మంచి అంచనాలున్న సినిమాలు రాబోతున్నాయి కాబట్టి బాక్సాఫీస్ కళకళలాడటం ఖాయమని భావిస్తున్నారు.