ముంచేసిన రానా సినిమా

దగ్గుబాటి రానా కెరీర్లో చాలా స్పెషల్ మూవీ అవుతుందని ‘అరణ్య’ మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు అతడి అభిమానులు. ‘బాహుబలి’తో మంచి గుర్తింపు సంపాదించాక రానా చేసిన పాన్ ఇండియా సినిమాల్లో ఇదొకటి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించాడు తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్.

అడవులు, అక్కడి జంతువుల నేపథ్యంలో హృద్యమైన సినిమాలు తీస్తాడని పేరున్న ప్రభు.. రానాకు ఓ మరపురాని సినిమాను అందిస్తాడన్న అంచనాలు కలిగాయి ఈ సినిమా ప్రోమోలు చూస్తే. కానీ సుదీర్ఘ కాలం మేకింగ్‌లో ఉండి, సినిమా పూర్తయ్యాక కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడి ఈ ఏడాది మార్చి చివరి వారంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘అరణ్య’. తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజైన ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చింది. పూర్ ఓపెనింగ్స్‌తో మొదలైన ఈ చిత్రం రెండు భాషల్లోనూ డిజాస్టర్‌గా నిలిచింది.

తెలుగు, తమిళ భాషల నుంచి ఏమాత్రం రెవెన్యూ రాబట్టని ఈ చిత్రం నిర్మాణ సంస్థ ‘ఈరోస్’ను గట్టి దెబ్బే కొట్టింది. ఆ టైంలో హిందీలోనూ విడుదలకు ఏర్పాట్లు చేశారు కానీ.. సెకండ్ వేవ్ కారణంగా ఉత్తరాదిన థియేటర్లు చాలా వరకు మూతపడటంతో హఠాత్తుగా హిందీ వెర్షన్ రిలీజ్ ఆపాల్సి వచ్చింది. తెలుగు, తమిళంలో సినిమా డిజాస్టర్ కావడం, హిందీ మార్కెట్ పరిస్థితి అసలేమాత్రం బాగా లేకపోవడంతో ఈ చిత్రాన్ని నార్త్‌లో ఎంతకూ రిలీజ్ చేయలేని పరిస్థితి వచ్చింది. దీంతో ‘అరణ్య’ థియేట్రికల్ రెవెన్యూ దాదాపు జీరో అయిపోయింది.

ఇప్పుడిక దీని హిందీ వెర్షన్‌ను ఓటీటీ ద్వారా నామమాత్రంగా రిలీజ్ చేయడానికి రెడీ అయింది ఈరోస్ సంస్థ. ఈ నెల 18న జీ సినిమా, ఈరోస్ ఓటీటీల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. మొత్తంగా చూస్తే ఈ సినిమా మీద ఈరోస్ వాళ్లు పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరే అయినట్లే. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో అమేజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న ఈ డిజాస్టర్ మూవీకి హిందీలో ఏమాత్రం రెస్పాన్స్ వస్తుందో చూడాలి.