మాస్ రాజా రవితేజ టాలీవుడ్లో ఒక అప్‌కమింగ్ ఆర్టిస్టుకు ఫోన్ చేసి అభినందిస్తే.. ఇంతకీ మీరెవరు.. మీ పేరేంటి అని అడిగితే ఎలా ఉంటుంది? అవసరాల శ్రీనివాస్ ఇదే పని చేశాడట. ‘అష్టాచెమ్మా’ సినిమాలో క్యారెక్టర్ రోల్‌తో అవసరాల టాలీవుడ్‌కు పరిచయం అయిన సంగతి తెలిసిందే. తొలి సినిమాలోనే చక్కటి నటనతో అతను చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక కొత్త నటుడిలాగే అనిపించలేదతను. ఈ పాత్రకు గొప్ప ప్రశంసలు లభించాయి.
ఆ సమయంలో రవితేజ.. అవసరాల నంబర్ తెలుసుకుని ఫోన్ చేసి అభినందించాడట. ఐతే కాల్ చేసినపుడు రవితేజ తానెవరో చెప్పకుండా అతడితో సంభాషణ సాగించాడట. తనతో మాట్లాడుతున్నదెవరో తెలియక చివర్లో మొహమాట పడుతూనే.. ఇంతకీ మీ పేరేంటి అని అడిగాడట రవితేజను. నన్నందరూ రవితేజ అంటారండీ అంటూ నవ్వేశాడట రవితేజ.
కమెడియన్ ఆలీ నిర్వహించే టీవీ ఇంటర్వ్యూ కార్యక్రమంలో అవసరాల ఈ విషయం వెల్లడించాడు. ఇక ‘అష్టాచెమ్మా’ సినిమాకు తాను ఎంపికైన విషయం తన తల్లిదండ్రులకు తెలియదని.. ఈ సినిమా ప్రోమోలు బయటికి వచ్చాకే వాళ్లకు అసలు విషయం తెలిసిందని.. ఐతే చేస్తే చేశావు కానీ.. ఈ సినిమాతో ఆపేయమని తన తండ్రి తనకు చెప్పాడని అవసరాల గుర్తు చేసుకున్నాడు.
తాను దర్శకుడిగా మారి ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా తీశాక తన మీద తండ్రికి గురి కుదిరిందని అతను చెప్పాడు. ఇక సినీ రంగంలో తాను అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నపుడు ఒక దర్శకుడు తాను నటుడిగా పనికి రానని అన్నాడని.. ఆయన అలా అన్నాడని తానేమీ నిరాశ చెందకుండా ప్రయత్నం చేశానని.. ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానని అన్నాడు అవసరాల.
Gulte Telugu Telugu Political and Movie News Updates