సురేష్ బాబు మౌనం.. ఆ సినిమాలకు శాపం

టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు తన నిర్మాణంలో తెరకెక్కిన చిత్రాల విషయంలో సుదీర్ఘ కాలంగా మౌనం పాటిస్తుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టాలీవుడ్ మూల స్తంభాల్లో ఒకడిగా ఉంటూ.. చెప్పుకోదగ్గ సంఖ్యలో థియేటర్లను నడిపిస్తూ.. ఎగ్జిబిటర్ల కష్టాలు పట్టకుండా తన ప్రొడక్షన్లో తెరకెక్కిన సినిమాలను ఓటీటీ బాట పట్టించడం ద్వారా ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు కొంత కాలంగా.

కరోనా సెకండ్ వేవ్ ముగిసే సమయానికి సురేష్ బాబు దగ్గర విడుదలకు సిద్ధంగా మూడు చిత్రాలున్నాయి. అవే.. నారప్ప, దృశ్యం-2, విరాటపర్వం. వేరే నిర్మాతల భాగస్వామ్యంతో సురేష్ ఈ చిత్రాలను నిర్మించారు. ఈ మూడు చిత్రాలకూ ఓటీటీ డీల్స్ పూర్తయినట్లు రెండు నెలల ముందే వార్తలొచ్చాయి. ఐతే వాటిలో ‘నారప్ప’ ఒకటే అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. ఈ విషయాన్ని కూడా చాలా రోజులు దాచి ఉంచి.. సడెన్‌గా సినిమాను రిలీజ్ చేయించాడు సురేష్. ‘నారప్ప’ లాంటి పెద్ద సినిమాను బిగ్ స్క్రీన్లలో రిలీజ్ చేసి థియేటర్ల పునరుజ్జీవానికి తోడ్పడాల్సింది పోయి.. ఓటీటీలో రిలీజ్ చేయడమేంటనే ప్రశ్నలు ఆయన్ని వెంటాడాయి.

కానీ నిర్మాతకు ఏది మంచిదో అది చేస్తాడంటూ ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఐతే ఈ మాటకు కట్టుబడినపుడు ధైర్యంగా మిగతా సినిమాల డీల్స్ గురించి కూడా వెల్లడించాల్సింది. అలాగే వాటిని సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాల్సింది. కానీ దృశ్యం-2, విరాటపర్వం సినిమాల విషయంలో ఆయన మౌనాన్ని కొనసాగిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రెండు చిత్రాలు సురేష్ బాబు మౌనం కారణంగా అసలు వార్తల్లో లేకుండా పోయాయి. వాటి స్టేటస్ ఏంటో తెలియట్లేదు. ఎక్కడా వాటి గురించి చర్చే లేదు.

ఈ రోజుల్లో ఇలా చిత్రీకరణ పూర్తయ్యాక ప్రమోషన్లకు దూరంగా వార్తల్లో లేకుండా పోవడం ఏ సినిమాలకూ మంచిది కాదు. మరి సురేష్ బాబు మనసులో ఏముందన్నది అర్థం కావడం లేదు. ఓటీటీ డీల్స్ పూర్తయితే సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయాలి. లేని పక్షంలో థియేట్రికల్ రిలీజ్‌కైనా రెడీ చేయాలి. మరి ఎటూ కాకుండా ఆ సినిమాలను ఎందుకు పక్కన పెట్టేశారన్నదే అర్థం కాని విషయం.