అందం, అభినయం.. ఇవి రెంటికీ తోడు లవబుల్‌గా అనిపించే వ్యక్తిత్వం ఉన్న హీరోయిన్లు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంటారు. ఈ తరం హీరోయిన్లందరూ దాదాపుగా ఇలాగే కనిపిస్తారు. వ్యక్గిగతంగా కూడా అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. సమంత తిరుగులేని ఇమేజ్ సంపాదించడానికి తన పర్సనల్ క్యారెక్టర్ కూడా ఒక కారణం అనడంలో సందేహం లేదు.
మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ కూడా ఇలా లవబుల్‌గా అనిపించే అమ్మాయే. అనుపమ ఇప్పటిదాకా నటించిన ఏ సినిమాలో కూడా తన నటన బాగా లేదు అనేలా ఉండదు. తెలుగులో చేసిన తొలి చిత్రం ‘అఆ’ దగ్గర్నుంచి ప్రతి సినిమాలోనూ నటిగా ఆకట్టుకుంటూనే ఉంది. అందంతోనూ ఆమె మెప్పించింది. అడపాదడపా విజయాలందుకుంటూ ఒక దశ వరకు టాలీవుడ్లో ఆమె బండి బాగానే నడిచింది కానీ.. ఉన్నట్లుండి అవకాశాలు తగ్గిపోయాయి. చివరగా ‘రాక్షసుడు’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిందామె. ఆ సినిమా బాగానే ఆడినప్పటికీ తన కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు.
ఒక దశలో చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేని అనుపమకు.. ఇక్కడ కెరీర్ అయిపోయినట్లే కనిపించింది. కానీ ఇలాంటి టైంలో సుకుమార్ స్క్రిప్టుతో గీతా ఆర్ట్స్ మొదలుపెట్టిన ‘108 పేజెస్’లో అనుకోకుండా అనుపమకు అవకాశం దక్కింది. ఈ సినిమా చేస్తూ నిఖిల్‌తో మంచి దోస్తీ కుదిరింది అనుపమకు. సోషల్ మీడియాలో వీళ్లిద్దరి కాన్వర్జేషన్లు చూస్తే మంచి ఫ్రెండ్స్ అయ్యారనే విషయం అర్థమవుతుంది. ఈ స్నేహమే అనుపమ కెరీర్‌కు ఉపయోగపడుతున్నట్లుంది. నిఖిల్ తర్వాతి చిత్రంలోనూ ఆమెనే కథానాయికగా ఎంచుకున్నారు.
తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘కార్తికేయ’కు సీక్వెల్ చేస్తున్నాడు నిఖిల్. ఈ చిత్రం గత ఏడాదే పట్టాలెక్కింది. చాలా వరకు షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. కానీ కథానాయిక ఎవరన్నది బయటపెట్టనే లేదు. జన్మాష్టమి సందర్భంగా ఈ చిత్రంలో అనుపమే కథానాయిక అనే విషయాన్ని వెల్లడించారు. అనుపమతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న విషయాన్ని కూడా నిఖిల్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ఈ సినిమాలో నటించడం పట్ల అనుపమ చాలా ఎగ్జైట్ అయింది. ‘కార్తికేయ’ను రూపొందించిన చందూ మొండేటినే ఈ చిత్రానికీ దర్శకుడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates